కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై పేరును నియమించింది బీజేపీ అధిష్ఠానం. యడియూరప్ప క్యాబినెట్ లో బొమ్మై ఇప్పటివరకు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బొమ్మై నాయకత్వ లక్షణాలపై బీజేపీ హైకమాండ్ పూర్తి విశ్వాసం ఉంచింది.
ఇప్పటివరకు సీఎంగా ఉన్న యడియూరప్ప తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎంపిక అనివార్యమైంది. రేసులో పలువురి పేర్లు వినిపించినప్పటికీ, బీజేపీ పెద్దలు బొమ్మై వైపు మొగ్గు చూపారు. బెంగళూరు విచ్చేసిన బీజేపీ కేంద్ర పరిశీలకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మరో మంత్రికిషన్ రెడ్డిలు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమై సీఎం ఎంపికపై చర్చించారు. అనంతరం కర్ణాటక నూతన సీఎంగా బొమ్మై పేరును ప్రకటించారు. బుధవారం బొమ్మై సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.