కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు సీఎంగా బొమ్మైతో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడైన బసవరాజ్ బొమ్మై ఇది వరకు హోంమంత్రిగా కొనసాగారు. అంతేగాక, యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా పేరుతెచ్చుకున్నారు. కర్ణాటకకు ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్.అశోక్, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఆ పదవులు చేపట్టనున్నారు.
లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ బొమ్మై సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో బసవరాజ బొమ్మై నాయకత్వాన్ని కర్ణాటక బీజేపీ నేతలు అందరూ ఆమోదించారు. బెంగళూరులో మంగళవారం జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో బొమ్మై పేరును సీఎం పదవికి యడియూరప్ప ప్రతిపాదించగా గోవింద కారజోళ బలపరిచారు. బీజేపీ అధిష్ఠానం తరఫున పరిశీలకులుగా హాజరైన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డిలు.. బొమ్మై పేరును అధికారికంగా ప్రకటించారు.