Tuesday, November 26, 2024

TS | బాసర ట్రిపుల్‌ ఐటీ షెడ్యూల్‌ విడుదల.. జూన్‌ 5 నుంచి దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో ఆరేళ్ల బీటెక్‌ కోర్సు ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదలైంది. జూన్‌ 1న నోటిఫికేషన్‌ వెలువడనుంది. జూన్‌ 5 నుంచి 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే స్పెషల్‌ కేటగిరీ కింద పీహెచ్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ తదితర విద్యార్థులు జూన్‌ 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్‌ 26న మెరిట్‌ జాబితాను ప్రకటిస్తారు. జూలై 1న ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్‌ చేయవలసి ఉంటుంద. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు రూ.500కాగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.450గా నిర్ణయించారు.

పదో తరగతిలో వచ్చే మార్కుల (జీపీఏ) ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు. షెడ్యూల్‌ విడుదల సందర్భంగా ఆర్జీయూకేటీ వీసీ ప్రొ.వి.వెంకటరమణ మీడియాతో బుధవారం మాట్లాడారు. 18 ఏండ్లు మించిన విద్యార్థులకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ట్రిపుల్‌ ఐటీలోని 85 శాతం సీట్లు లోకల్‌ వాళ్లకు, మిగిలిన 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీకి వర్తిస్తాయన్నారు. విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు అవసరమయ్యే కుల, ఆదాయ ధృవపత్రాల జారీలో ఆలస్యం చేయొద్దని ఆయన అధికారులకు సూచించారు. ఈమేరకు సంబంధిత ఉన్నతాధికారులకు ఆయన లేఖను కూడా రాయనున్నట్లు తెలిపారు.

వర్సిటీకి త్వరలో ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జూన్‌ 20న వర్సిటీ ఓపెన్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెమిస్టర్‌ విధానాన్ని ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. వెనుకబడిన విద్యార్థులు, కొంత మంది అమ్మాయిలు చదువు మధ్యలో డ్రాపౌట్‌ అవుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసే ఐటీ టవర్స్‌లో విద్యార్థులు చేసే నూతన ఆవిష్కరణలతో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన వివరించారు. నిర్మల్‌ హబ్‌, వర్సిటీలో ఐటీ గర్ల్స్‌ ల్యాబ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. విదేశీ వర్సిటీలను బాసర వర్సిటీకి తీసుకొచ్చి సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఎన్‌ఆర్‌ఐలతో అమెరికా నుంచి ప్రతీ శని, ఆదివారాల్లో విద్యార్థులకు ప్రత్యేక ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్సిటీలోని తొమ్మిది వేల మంది విద్యార్థులకు సరిపడా అడ్వాన్స్‌డ్‌ కిచన్‌ ఏర్పాటుకు సంబంధించి జూన్‌ 1న టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు, దీనికి సంబంధించి అక్షయపాత్ర, ఇతర సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతీ వారంలో ఒకరోజు విద్యార్థులకు పెట్టే మాసాంహార భోజనాన్ని ఆ ప్రాంతంలో ఉండే మహిళా సంఘాలకు క్యాటరింగ్‌ బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement