కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు తీవ్ర వివాదాన్ని సృష్టించాయి. వీటిని వ్యతిరేకిస్తూ ఏడాదికి పైగా రైతులు ఉద్యమించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రధాని నరేంద్ర మోడీ యావత్ దేశ ప్రజలకు క్షమామణలు చెప్పారు. ఆ తర్వాత వాటిని రద్దు చేశారు. అయితే కేంద్ర తీసుకున్న మరో నిర్ణయం బ్యాంకర్లను ఆందోళనబాట పట్టిస్తోంది. దేశంలోని బ్యాంకుల యూనియన్లు సైతం మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. బ్యాంకులను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2021ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ యోచనకు నిరసనగా బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి.
బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తామని ఆయా సంఘాలు పేర్కొంటున్నాయి. డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఇప్పటికే యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో దేశంలోని అన్ని బ్యాంకులతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలలోని సేవలు సైతం ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దేశంలోని ప్రభుత్వ పలు రంగ సంస్థల రుణాలు అధికం కావడంతో పాటు నష్టాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయనే కారణాల చూపుతూ.. పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రత్యేక ప్రణాళిక గురించి వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే సంస్థల్లోని పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ పెట్టుబడులను 51 శాతం నుంచి 26 శాతానికి తగ్గించుకోనుంది. ఇటీవలే ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించడం సహా నాలుగు సంవత్సరాల్లో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ బిల్లుకు వ్యతిరేకంగా రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నట్టు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. సమ్మె గురించి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ మహేశ్ మిశ్రా మాట్లాడుతూ.. బ్యాంకింగ్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్-2021కు వ్యతిరేకంగా ఈ నెల 16, 17 తేదీల్లో సమ్మె నిర్వహిస్తామని అన్నారు. బ్యాంకింగ్ ప్రైవేటీకరణ నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాని కోరారు. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి తాము వ్యతిరేకమని తెలిపారు. అలాగే, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపరిచే లక్ష్యంతో తీసుకువచ్చిన బ్యాంకింగ్ సంస్కరణల విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు.