మీకు బ్యాంకు ఖాతా ఉందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. జులై 1 నుంచి ఎన్నో మార్పులు రానున్నాయి. కొన్ని బ్యాంకులు తమ సర్వీస్ ఛార్జీలు పెంచగా.. మరికొన్ని ఐఎఫ్ఎస్సీ కోడ్లే చెల్లవని చెప్పాయి. మరి ఏఏ బ్యాంకులు ఏం మార్పులు చేశాయో, కస్టమర్లు ఏం చేయాలో తెలుసుకోండి. బ్యాంకు ఖాతాదారులంతా అప్రమత్తం కావాల్సిన సమయం ఇది. జులై 1 నుంచి ఏటీఎంలో నగదు ఉపసంహరణ మొదలుకొని.. కొత్త ఐఎఫ్‌ఎస్‌ఎస్ కోడ్ల వరకు ఎన్నో మార్పులు రానున్నాయి.
జులై 1 నుంచి వచ్చే మార్పులివే..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ.. సేవింగ్స్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఛార్జీలు పెంపు నగదు ఉపసంహరణ సేవల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు మార్పులు చేసింది. తమ బ్యాంకు ఏటీఎంల నుంచి నాలుగు లావాదేవీలు మాత్రమే ఉచితంగా చేసుకునే వీలు కల్పించనుంది. ఆ పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 15 (జీఎస్టీ అదనం) వసూలు చేయనుంది. ఇక, చెక్ బుక్ వినియోగంపై పరిమితులు విధించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 10 చెక్కులను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఇంకా కావాలాంటే.. అదనంగా ఛార్జీలు విధించనుంది. 10 చెక్స్- రూ.40+ జీఎస్టీ, 25 చెక్స్- రూ. 75+జీఎస్టీ సీనియర్ సిటిజన్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.
సేవింగ్స్ ఖాతాదారులకు పలు సర్వీస్ ఛార్జీలను యాక్సిస్ బ్యాంకు పెంచింది. ఇప్పటికే వీటిలో కొన్ని మే 1 నుంచి అమల్లోకి రాగా.. సవరించిన మరికొన్ని జులై 1 నుంచి అమలు కానున్నాయి. ఇందులో భాగంగా.. ఎస్ఎంఎస్ అలర్ట్‌కు కూడా డబ్బులు వసూలు చేయనుంది యాక్సిస్ బ్యాంక్. టెలికాం శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్క అలర్ట్‌కు రూ. 25 పైసల చొప్పున గరిష్ఠంగా నెలకు 25 రూపాయల వరకు ఛార్జీ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఇది నెలకు రూ. 5గా ఉండేది. ప్రమోషనల్ మెసేజ్‌లు, వన్ టైం పాస్వర్డ్ ఓటీపీలకు ఎలాంటి ఛార్జీ చేయబోమని స్పష్టం చేసింది. సేవింగ్స్ అకౌంట్లో ఉండాల్సిన కనీస మొత్తాన్ని కూడా పెంచింది. దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్‌కు.. 20 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. సిలిండర్ ధరల పెంపు.. ఎల్పీజీ సిలిండర్ల ధరలు.. ప్రతి నెలా మొదటి రోజే నిర్ణయిస్తారు. ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ.. జులై 1 నుంచి ఈ ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. గత రెండేళ్లుగా పన్ను చెల్లింపులు చేయని వారికి.. టీడీఎస్ రేట్లు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇది జులై నుంచే అమల్లోకి రానుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీలినమైన ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాదారులు కొత్త చెక్ బుక్‌లు తీసుకోవాలని సూచించింది. పాతవి జులై 1 నుంచి చెల్లవని స్పష్టం చేసింది. ఆ ఐఎఫ్ఎస్సీ కోడ్లు బంద్! సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులంతా వెంటనే తమ ఐఎఫ్ఎస్సీ కోడ్, చెక్‌బుక్‌లు అప్డేట్ చేసుకోవాలని కెనరా బ్యాంక్ సూచించింది. సిండికేట్ బ్యాంక్ గత ఏడాది కెనరా బ్యాంక్‌లో విలీనమైన కారణంగా.. పాత ఐఎఫ్ఎస్సీ కోడ్లు, చెక్ బుక్‌లు జులై 1 నుంచి చెల్లవని స్పష్టం చేసింది. ఈ విషయమై ఇప్పటికే సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులందరికీ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమిచ్చినట్లు వెల్లడించింది.
ఐఎఫ్ఎస్సీ కోడ్‌లో మార్పు ఎందుకు?
బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 2019లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మెగా విలీనం 2020 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనమైంది. దీంతో సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ స్థానంలో తమ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను వినియోగంలోకి తీసుకొస్తోంది కెనరా బ్యాంక్. ఇంకా కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాయి.