Friday, November 22, 2024

బంగినపల్లి బంగారం.. రుచి ఎంతో మధురం!

వేసవిలో విరబూసే..విరగకాసే మామిడి కోసం ఎదురుచూడని వారుండరు. మార్కెట్లో కనిపిస్తే ఎప్పుడు తినేద్దామా అనిపించని రోజుండదు. తెలుగు రాష్ట్రాల్లో విరివిగా పండేబంగినపల్లి మామిడి రుచి ప్రత్యేకమైంది. పసుపు వర్ణంలో మెరుస్తూ తీయగా ఉండే ఈ పండును చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే. నవాబులకు నిలయమైన బనగానపల్లి బంగినపల్లి బేనీసాకు పెట్టింది పేరు. బంగినపల్లి… పండ్లలో రారాజు.. ఆ పేరు వింటేనే నోరూరేస్తోంది. ఇక తింటే ఆ రుచే వేరు.. ఆ సువాసనే వేరు. ఇప్పుడా పండ్లకు సీజన్‌.. మార్కెట్లలో ఎక్కడ చూసిన కనిపంచే బంగినపల్లి రకానికి బనగానెపల్లెతో విడదీయలేని బంధం ఉంది. ఈ ఏడాది జిల్లాలో బంగినపల్లి సాగురైతుల్లో సంతోషం వెల్లివిరుస్తుండగా.. ప్రియమైన కొనుగోలు దారులు ఆసక్తి చూపుతునే ఉన్నారు.

ప్రధానంగా బేనిస, రసాలు, మల్గువ, పసందు, చక్కెరపార లాంటి మామిడిపండ్లకు కర్నూల్ జిల్లా ప్రసిద్ది. జిల్లా వ్యాప్తంగా 3,600 హెక్టార్లలో ఈ బంగినపల్లి మామిడిపండ్లు సాగుచేశారు. ఒక్క బనగానపల్లి మండలంలోనే దాదాపు 800 ఎకరాలకు పైగా మామిడి సాగుచేశారు. ఈ ఏడాది కరోనా కారణంగా పంట కొంత ఆలస్యమైనా దిగుబడి అధికంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది టన్ను దాదాపు రూ.75 వేల వరకు పలుకుతోంది. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మామిడి పంటకు సంబంధించి పూత దశ నుండే ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బనగానపల్లి మండలంలో సాగయ్యే మామిడిపండుకు మంచి గిరాకీ ఉంటుంది. బంగినపల్లికి బేనిసగా పేరుంది. ఈ రకం పండ్లు ఏ గ్రేడ్‌ రకంగా చేసి విదేశాల నుండి ప్రత్యేక ఆర్డర్లు వస్తున్నాయి. సింగపూర్‌, అమెరికాకు కూడా ఎక్కువగా బనగానపల్లి బేనిస మామిడిపండును ఎగుమతి చేస్తున్నారు. ఏజెంట్లు కమీషన్లు లేకుండా, కూలీ ఖర్చులు లేకుండా వ్యాపారులే భరిస్తూ మామిడిపండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెలాఖరుకు దిగుబడి పూర్తిగా మార్కెట్లోకి వస్తుందని కర్నూలు జిల్లా ఉద్యానశాఖ ఏడి రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో 3,600 హెక్టార్లలో మామిడి సాగుచేశారని, దాదాపు 27వేల టన్నులు మామిడి దిగుబడి రావచ్చని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు మరో 3లక్షలు అదనంగా ఉత్పత్తి అయ్యే అవకాశం కూడా ఉండవచ్చని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి.

బంగినపల్లి .. ఆ పేరెలా వచ్చిందంటే..

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మామిడి రకాలలో బంగినపల్లి మామిడి ఒకటి. తెలుగింట పుట్టి ప్రపంచంలోని అనేక దేశాల ప్రజల నోరూరించే ఈ రకం మామిడి ‘ఆంధ్రప్రదేశ్‌ సొంతం’ అని నిర్ధారిస్తూ భౌగోళిక విశిష్ఠ గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఐడెంటికేషన్‌ – జీఐ) లభించింది. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీఓపీ గుప్తా దీనికి సంబంధించిన ధ్రువపత్రం జారీ చేశారు. ఒక మహిళ, పురుషుడు (రైతులు), పసుపు పచ్చ వర్ణంలో మామిడిపండ్లతో బనగానపల్లె నవాబు యుద్ధ నిధుల మొహరీ రూపొందించారు. దానిపై ‘బనగానపల్లె మామిడిపండ్లు – ఆంధ్రప్రదేశ్‌’ అని లిఖించారు. ఇదే ప్రధాన ఆధారంగా బంగినపల్లి మామిడిపండ్లకు జీ.ఐ. గుర్తింపు లభించింది.

కర్నూలు జిల్లా లోని బనగానపల్లె సంస్థానం అప్పట్లో నవాబుల ఏలుబడిలో ఉండేది. నవాబు మీర్‌ గులాం అలీఖాన్‌ (1905-1922) కు మామిడిపండ్లపై మక్కువ ఎక్కువ. మామిడి పండులో మేలు జాతిగా పిలిచే బేనిషాన్‌ రకాన్ని ఎంపిక చేసుకొని బనగానపల్లె సంస్థానంలో విరివిగా నాటించారు. దీనికే ‘బనగానపల్లె మామిడి’గా పేరు వచ్చింది. కాలక్రమంలో ఇదే బంగినపల్లిగా మారింది.

- Advertisement -

ఇక్కడి నుంచే తెలుగు రాష్ట్రాల్ల్రోని అనేక ప్రాంతాలకు ఈ రకం సాగు విస్తరించింది. ప్రతి ఏటా 5500 టన్నుల బంగినపల్లి మామిడి పండ్లు అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలకు ఎగుమతి అవుతాయి. ఏమాత్రం పీచు లేకుండా పూర్తిగా గుజ్జు మాత్రమే ఉండడం దీని ప్రత్యేకత. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టు-కి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్‌) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి చెట్టు-కి ఏ గుర్తు చెక్కించక, దానికి గుర్తు లేనిది (బే నిషాన్‌) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఈ మామిడి పండు చాలా రుచిగా ఉంటుంది. దాదాపు 350 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నివాసులైన నవాబులు విదేశాల నుంచి తీసుకొచ్చి నాటిన మామిడి రకాలలో ఒక మామిడి రకం రుచిలోను, రంగులోను, పరిమాణంలోను విశేషమైన ఖ్యాతిని సంపాదించడంతో ఈ చెట్టుకు కాసిన మామిడి పండ్లను అనేక ప్రాంతాల వారు తీసుకుని వెళ్లి నాటారు. ఈ చెట్టు ఎక్కడ నుంచి తెచ్చి నాటారు అని అడిగినప్పుడు ఇది బనగానపల్లి మామిడి చెట్టు అని చెబుతుండేవారు. ఈ విధంగా బనగానపల్లి మామిడిగా వాసి కెక్కిన ఈ చెట్టు- కాలక్రమంలో బంగినపల్లి మామిడిగా ప్రసిద్ధి పొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement