హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని రిలయన్స్‌లో మహిళా సిబ్బందిపై వేధింపులు ఎక్కువవుతున్నాయని, రోజూ టార్చర్ భరించలేకపోతున్నామని కన్నీరు పెడుతూ కొంతమంది మహిళా సిబ్బంది వాపోయారు. లేబర్ రూల్స్ ప్రకారం 8 గంటల డ్యూటీ చేయాల్సి ఉండగా.. దాదాపు 12 గంటలపాటు పనిచేయించుకుంటూ సరైన వేతనాలు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయినా.. పనిచేసి ఇంటికి వెళ్లిన సిబ్బందిని రాత్రివేళ కూడా ఫోన్‌చేసి వేధింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం.
ఇక.. స్టోర్ సామర్థ్యానికి సరిపడ స్టాఫ్‌ని నియమించుకోకుండా అక్కడ పనిచేస్తున్న స్టోర్ మేనేజర్ తక్కువ మంది స్టాఫ్‌తో నెట్టుకొస్తూ.. ఉన్న వారిమీదనే బర్డెన్ మోపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో తక్కువ మంది పనిచేయడం వల్ల సెలవులు, వీక్ ఆఫ్‌లు లేకుండా ఇబ్బందికి గురవుతున్నారు. కొంతమందికి హెల్త్ బాగా లేకున్నా పనిచేయాలని వేధిస్తున్నట్టు వారి మాటల ద్వారా తెలుస్తోంది. దీంతో ఈ మధ్య కాలంలో చాలామంది స్టోర్ నుంచి పనిమానేసి వెళ్లడం గమనార్హం. అయితే.. స్టోర్ మేనేజర్, ఇతర మగ సిబ్బంది వేధింపులపై ఉపాధి కోసం దూర ప్రాంతాల నుంచి పనిచేసుకుంటున్న మహిళా సిబ్బంది షీటీమ్స్‌కి కంప్లెయింట్ చేసినట్టు సమాచారం. దీనిపై వారు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా.. స్టోర్‌లో కొంతమంది గ్రూపులుగా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయం స్టోర్ మేనేజర్‌కు తెలిసే వారిని ఎంకరేజ్ చేస్తున్నాడనీ, అయితే.. ఇది మిగతా సిబ్బందికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని అక్కడ పనిచేస్తున్న వారిలో పేరు చెప్పేందుకు నిరాకరించిన చాలామంది ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయాలేవీ బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. ఇంతకుముందు కొంతమంది మహిళా సిబ్బందిపై అఘాయిత్యాలు కూడా జరిగిన ఘటనలున్నాయి. వీటిని బయటకు తెలిస్తే స్టోర్‌కు బ్యాడ్ నేమ్ వస్తుందని జాబ్ నుంచి తొలగించినట్టు సమాచారం. స్టోర్ మేనేజర్ ఇష్టమున్నట్టు వ్యవహరించడం వల్లనే బాగా లాభాల్లో రన్ అయ్యే స్టోర్ కాస్త ఈ మధ్య కాలంలో తెలంగాణలోనే చెడ్డపేరు తెచ్చుకుందనే టాక్ కూడా ఉంది.
ఈ విమర్శలు, ఆరోపణలపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్టోర్ మేనేజర్ కూడా సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. దీంతో అక్కడ అక్రమాలు జరుగుతున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్టవుతోంది. మహిళా సిబ్బందిని వేదింపులకు గురిచేసే అంశంపై తెలంగాణ షీటీమ్స్‌కి కంప్లెంట్ చేయనున్నట్టు కొంతమంది తెలిపారు. ఉపాధి కోసం వచ్చే మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.