Thursday, November 21, 2024

Telangana Politics: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ.. డెడ్ లైన్ పెట్టి వార్నింగ్!

ఎరువుల ధరలు పెంచడంపై ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరోసారి బహిరంగ లేఖ రాశారు. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీకి మీరు రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని అన్నారు. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుడుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్న ఈ తరుణంలో వాటిని దారి మళ్లించేందుకే ప్రధానికి బహిరంగ లేఖ పేరిట మీరు కొత్త డ్రామాకు తెరదీసినట్లు కన్పిస్తోంది అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలతో ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్లతో ‘సకినాల పిండి’ని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మీరు చేసిన తప్పిదాలను సరిదిద్దుకోకుండా ఎదురు దాడి చేస్తూ రాజకీయ డ్రామాలు చేస్తున్నందున వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీరు లేవనెత్తిన అంశాలపై స్పందిస్తూ బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని బండి సంజయ్‌ పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తానని ఇచ్చిన మాటకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలులో భాగంగా ఏటా కనీస మద్దతు ధరను పెంచడంతోపాటు రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. సీఎం ముందు కొన్ని డిమాండ్లను పెట్టిన బండి సంజయ్‌.. వాటిని ఉగాది వరకు అమలు చేయాలని డెడ్‌లైన్‌ పెట్టారు. లేకుంటే ఉద్యమం చేస్తామని బండి సంజయ్ లేఖలో హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement