రాష్ట్రంలో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుండటం చూసి సీఎం కేసీఆర్‌లో అసహనం పెరిగిపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందువల్లే తమపై భౌతిక దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, తమను రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంపీ అర్వింద్‌పై దాడులు చేయించడం సిగ్గేచేటని అన్నారు. రైతులు ఎప్పుడూ కర్రలు, కత్తులు పట్టుకుని దాడులు చేయరని చెప్పారు. సీఎం కేసీఆర్‌కి ఏమాత్రం మానవత్వం ఉన్నా ఈ ఘటనపై స్పందించాలన్న బండి సంజయ్.. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, దాడితో సంబంధం ఉన్నవారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేయాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెబితే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏమవుతాయని సంజయ్ ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యుడిపై దాడి జరిగితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దారుణమన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉండేది మరొక సంవత్సరం మాత్రమేనని, బీజేపీ అధికారం చేపట్టగానే ఒక్కొక్కడి తాట తీస్తామని హెచ్చరించారు. ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిపై శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బండి సంజయ్ చెప్పారు.