ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రల ఎన్నికల్లో 4 రాష్ట్రల్లో బీజేపీ గెలవడంతోనే సీఎం కేసీఆర్ మైండ్ దొబ్బిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందుకే నిన్నటిదాకా ముందస్తు ఎన్నికలని ఊదరగొట్టి… ఇప్పుడు ముందస్తు లేదంటూ పారిపోయారని ఎద్దేవా చేశారు. పైగా సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వస్తాయని బీరాలు పలుకారని విమర్శించారు. సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వచ్చింది బీజేపీకి… టీఆర్ఎస్ కు వచ్చేది 5 లేకుంటే 9 సీట్లే అని పేర్కొన్నారు. మోదీ పాలన యూపీఏ పాలన కంటే అధ్వాన్నమంటావా? అని మండిపడ్డారు. యూపీఏలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నారని అన్నారు. ఆయనపై వచ్చిన సహారా, ఈఎస్ఐ స్కాంలు తెలియదా? అని నిలదీశారు. యూపీఏ పాలనకు, మోదీ పాలనకు లింకు పెట్టడమంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదన్నారు.
బోధన్ లో 35 మందిపై 307 కింద కేసు పెట్టారని, సిరిసిల్లలో 25 మంది కార్యకర్తలపై 307 కేసు పెట్టి జైల్లో వేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు….బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేక పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమకు కేసులను ఎట్లా ఎదుర్కోవాలో తెలుసున్నారు. మోదీ అద్బుత పాలనను చూసి విదేశాలే కీర్తిస్తున్నయని అన్నారు. పక్కనున్న పాకిస్తాన్ ఫ్రధాని సైతం మోదీ విదేశాంగ విధానం భేష్.. ఆయన పాలన చూసి నేర్చుకోవాలని పొగుడుతున్న సంగతి తెల్వదా? అని అన్నారు.