ఉమ్మడి ఖమ్మం, ప్రభన్యూస్ బ్యూరో: ”తెలం గాణలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్‌ను లేపాలని సీఎం కేసీఆర్ చేస్తున్నారు… అది సాధ్యం కాదు… ఐదు నెలల్లో కుటుంబపాలన అంతం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం రాబో తోంది. సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొ న్నారు. కర్ణాటక ఫలితాలకు తెలంగాణకు సంబంధం లేదని సంజయ్ పునరుద్ఘాటించారు. బీజేపీ ఆధ్వర్యం లో ఖమ్మంలో ఈ నెల 15న నిర్వహించే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సభ ఏర్పాట్లును బండి సంజయ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వాసి రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగించారు. ఖమ్మం బీజేపీ సభ రాష్ట్రానికే దిశా నిర్దేశం కావాలన్నారు. లక్ష మందితో ఖమ్మం సభ సక్సెస్ చేయాలని, ఆ రీతిలో ఏర్పాట్లు చేయాలని పార్టీ ముఖ్య నేతలకు ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ఖమ్మం ప్రజలకు భరోసా కల్గించేందుకు సభ నిర్వహిస్తున్నామన్నారు. అమిత్ షా మొదటిసారి ఖమ్మం వస్తున్నారన్నారని, ఖమ్మం నాయకుల మీద నమ్మకం ఉందన్నారు. నిరుద్యోగ ర్యాలీకి ఎంతమంది వస్తారంటే వేయి మంది మాత్రమే వస్తారని చెప్పారని, కానీ ఎంతమంది వచ్చారో అందరికీ తెలిసిందే అన్నారు. కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది వచ్చారని, వచ్చారా… రాలేదా… అంటూ జోష్ కల్గించారు. అందుకే ఖమ్మం స్ఫూర్తిని అన్నిచోట్ల చూపుతుంటానని, ఇక్కడ పార్టీ నిర్మాణం బాగుందని, తలచుకుంటే చేసే నాయకులూ ఉన్నారన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అంటు-న్నారని, ఇక్కడ పువ్వు వికసించాలని, అప్పుడే మనం మాట నిలబెట్టు-కున్నవాళ్ళమవుతాం అని పేర్కొన్నారు. బీజేపీకి తిరుగు లేదని, ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని పిలుపునిచ్చారు.
కమ్యూనిస్టులను ప్రస్తావిస్తూ అవి దాల్చా పార్టీలని వ్యంగ్య బాణాలు సంధించారు. వారు కూరగాయలు అమ్మేవారని, కూలీలను పార్టీ ధర్నాలకు, సభలకు తీసుకొని వస్తారని ఎద్దేవా చేశారు. దాల్చా అంటే తెల్సా అంటూ చలోక్తులు విసిరారు. టోకెన్ ఇచ్చి హోటల్‌లో భోజనం పెట్టించి ప్రజలను ధర్నాలకు తీసుకొని వస్తారని, వారి పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. వాటిని సూది దబ్బడం లేని పార్టీలు అని కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ కేసీఆర్‌తో కలిసి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి అనేక పార్టీలు ఓర్వలేక పోతున్నాయని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. దేశానికి నరేంద్రమోడీ అమిత్ షాల నాయకత్వం అవసరమని దేశ ప్రజలే కాకుండా ప్రపంచమే గుర్తించిందని అన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భారత్ వైపు ప్రపంచం చూస్తున్నదని పేర్కొన్నారు.
సాయంత్రం సభా ప్రాంగణం కోసం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులతో కలిసి బండి సంజయ్ స్థానిక సర్దార్ పటేల్ గ్రౌండ్, ఆ పక్కనే ఉన్న ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానాలను పరిశీలించారు. తొలుత పటేల్ గ్రౌండ్‌లో సభ నిర్వహిస్తున్నట్లు- చెప్పినప్పటికీ ఆ తరువాత ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్నార్ మైదానం పరిశీలించాక ఆ మైదానంలోనే సభ నిర్వహించేందుకు మొగ్గు చూపారు. ఆయా మైదానాల పరిశీలన సందర్భంగా అక్కడే పిల్లలతో కలిసి కాసేపు పుట్‌బాల్ ఆడారు. అనంతరం నడుచుకుంటూ రోడ్డు వద్దకు వచ్చి వైరా రోడ్డులో ఉన్న సునీల్ కేఫ్‌లో కార్యకర్తలతో కలిసి ఛాయ్ తాగారు.
లక్ష మందితో ఖమ్మం సభ
ఈ సందర్బంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ ఈనెల 15న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం వస్తున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. దేశం కోసం, దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జిల్లాకు వస్తున్న నేపధ్యంలో స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలపాలని కోరారు.