Saturday, November 23, 2024

పూటకో హామీ..గంటకో అబద్ధం.. కేసీఆర్ పై బండి నిప్పులు

తెలంగాణలో గడీల అరాచక పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ నోటికి హద్దు లేదని, నోరు తాటి మట్ట కంటే అధ్వాన్నం అని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం బండి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. కేసీఆర్ కు ఇచ్చిన హామీలు గుర్తు ఉండవన్నారు. పూటకో హామీ, గంటకో అబద్దం చెబుతారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. ఎవరినీ కలవకుండా ఫాంహౌజ్ లో నిద్రపోతారని విమర్శించారు. బీజేపీ దెబ్బకి భయపడి మొన్నటి నుండి ఫామ్ హౌజ్ వీడి బయటకొచ్చారన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం మళ్లీ హామీలిస్తూ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైయ్యారని మండిపడ్డారు. ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెబుతున్న కేసీఆర్.. గత 7 ఏళ్లల్లో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని ప్రశ్నించారు.

లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్నారు. దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. కేసీఆర్ సర్కార్ తీరుపై వందలాది మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్ దే బాధ్యత అని పేర్కొన్నారు. మంత్రులంతా కూడా కేసీఆర్ మాదిరిగానే మోసాల మూఠాగా తయారై 4 లక్షల ఉద్యోగాలిచ్చినమని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, మళ్లీ  నిరుద్యోగ భృతి అంటున్నారని విమర్శించారు. రెండేళ్లు అయినా నిరుద్యోగ భ్రుతికి దిక్కులేదన్నారు. రెండేళ్ల నుండి చూసుకుంటే ప్రతి నిరుద్యోగి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం లక్ష రూపాయాలు జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు డబ్బు ఇస్తున్నానని చెప్తున్న సీఎం.. రుణ మాఫీ అమలు చేయకపోవడంతో ఆ డబ్బులు బ్యాంకులు జమ చేసుకుంటున్నాయన్నారు. కోవిడ్ టైంలో నర్సుల సేవలు తీసుకున్న సీఎం.. నేడు మీరు అక్కర్లేదని 1700 మంది నర్సులను రోడ్దున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   

టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలయ్యే దాకా బీజేపీ పోరాడుతుందన్నారు. ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని బండి స్పష్టం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ నుండి గుంజుకొచ్చి హామీలన్నీ అమలయ్యేలా ఉద్యమిస్తాం అని వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూలు జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు. ఎంపీ సీటు సహా అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటామని బండి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి అంతిమంగా ‘ప్రజా స్వామిక తెలంగాణ’ లక్ష్యంగా ఆగస్టు 9 నుండి పాదయాత్ర చేయబోతున్నామని వెల్లడించారు. కార్యకర్తలంతా కలిసి పాదయాత్రను విజయవంతం చేయాలని బండి సంజయ్ కోరారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీతో పొత్తుకు యత్నిస్తున్నాయని చెప్పారు. అయితే, బీజేపీ మాత్రం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. స్వతంత్రగా పోటీ చేసి సొంతంగా అధికారంలోకి వస్తామని బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement