తెలంగాణలో కేసీఆర్‌ను రాజకీయంగా కనుమరుగు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్‌లో అధికార టీఆర్ఎస్‌కు అభ్యర్థి దొరకటం లేదన్నారు. ఉప ఎన్నికల్లో ఈటలపై టీఆర్ఎస్ గెలవదన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఓటమి భయంతోనే తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడ్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అరాచకత్వపు పాలనపై విసుగు చెందిన ఎంతో మంది నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బండి తెలిపారు. ఎన్నికలు వస్తేనే.. ప్రభుత్వానికి హామీలు, అభివృద్ధి గుర్తొస్తాయని విమర్శించారు.
ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తారని, ఎన్నికలు అయ్యాక పత్తా లేకుండా పోతారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందన్నారు. ఇప్పుడు ప్రగతిభవన్ దాటి బయటకు వస్తున్నారంటే దానికి కారణం బీజేపీనేనని చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆరెస్ ఓడిపోవటం ఖాయమన్నారు. డిపాజిట్లు గల్లంతు అవుతాయని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయని తెలిపారు. హుజురాబాద్ ప్రజలందరూ ఈటల రాజేందర్ లాంటి నాయకున్ని కష్టపడి ఎన్నుకున్నారు. ఇప్పుడు అలాంటి నాయకున్ని ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోరని, సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అరెస్టులు, బెదిరింపులతో హుజురాబాద్‌లో ఓటమిని ముఖ్యమంత్రే ఒప్పుకుంటున్నారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. టీఆర్ఎస్‌కు డిపాజిట్లు గల్లంతు కావటం ఖాయం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: పేదల కోసం వైఎస్ఆర్ బీమా పథకం… 1.32 కోట్ల మందికి సాయం