Wednesday, November 20, 2024

Telangana: కాళేశ్వరం సందర్శనకు పర్మిషన్​ కావాలే.. సీఎస్​ సోమేశ్​కుమార్​కు బండి సంజయ్​ లేఖ

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కెఎల్‌ఐపి)ని సందర్శించడానికి బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టును సందర్శించేందుకు బీజేపీకి చెందిన 30 మంది సభ్యుల ప్రతినిధి బృందానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సంజయ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఇవ్వాల (ఆదివారం) లేఖ రాశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా పేర్కొనే ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఈ విషయానికి ఇంపార్టెన్స్​ పెరిగింది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

హన్మకొండలో శనివారం జరిగిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ అవినీతికి కాళేశ్వరం పర్యాయపదంగా మారిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఈ ప్రాజెక్టు ఏటీఎంగా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ కూడా ఈ మధ్య కాళేశ్వరంలో అవినీతి అన్ని హద్దులు దాటిపోయిందని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టును నిర్మించారన్న ఆరోపణలు చేశారు.

ఇక.. జులైలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పంప్‌హౌస్‌లు గోదావరి వరద నీటిలో మునిగిపోయాయి. ముంపుపై విపక్ష నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. డిజైన్‌ లోపమే ఈ ఘటనకు దారితీసిందని ఆరోపించారు. గత నెలలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన కాంగ్రెస్‌ నేతల బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారంలో కాళేశ్వరం పర్యటనకు రాష్ట్ర బీజేపీ చీఫ్ అనుమతి కోరడం మరింత చర్చకు దారితీస్తోంది. ఈ బృందంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, నీటిపారుదల రంగ నిపుణులు సభ్యులుగా ఉంటారని ఆయన ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ముంపునకు గల కారణాలపై తమకున్న సందేహాలను నివృత్తి చేయాలని బీజేపీ చీఫ్‌ అన్నారు. నీటిలో మునిగిపోవడం వల్ల మోటార్లకు జరిగిన నష్టాన్ని ప్రతినిధి బృందం అంచనా వేయాలన్నారు.

- Advertisement -

1998లో వరదల కారణంగా టర్బైన్‌లకు జరిగిన నష్టాన్ని చూసేందుకు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించేందుకు ప్రతిపక్ష పార్టీలను అనుమతించిన విషయాన్ని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు సంజయ్ గుర్తు చేశారు. 2004, 2009 మధ్య అప్పటి ప్రభుత్వం అహాద్ జల యజ్ఞం కార్యక్రమం కింద వివిధ నీటిపారుదల ప్రాజెక్టులపై సందేహాలను నివృత్తి చేయడానికి ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించిందని కూడా అందులో పేర్కొన్నారు. తమ సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులను.. బీజేపీ ప్రతినిధి బృందంతో పంపాలని సంజయ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement