Wednesday, November 20, 2024

ఓరుగల్లు గడ్డపై కాషాయ జెండా: బండి

జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపుతో మంచి జోష్ లో ఉన్న బీజేపీ.. ఇప్పుడు పౌరుషాల గడ్డ ఓరుగల్లుపై ఫోకస్ పెట్టింది. త్వరలో జరిగే గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఓరుగల్లులో బీజేపీ పూర్తి మెజార్టీతో గెలవబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని, ప్రభుత్వంపై కొట్లాడే అభ్యర్థులకే టికెట్లు ఇచ్చామని చెప్పారు. వరంగల్ అభివృద్ధికి కేంద్రం కోట్లాది రూపాయలు వెచ్చించిందని, దీనిపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చర్చకు సిద్ధమేనా? అంటూ సవాల్ విసిరారు. నిధులు ఇచ్చి నాణ్యతతో పనులు చేసే పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నామని బండి సంజయ్​ వెల్లడించారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గూండాలను, నేరస్థులను అభ్యర్థులుగా ఎంపిక చేశారని సంజయ్ ఆరోపించారు. ఇందుకు వరంగల్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి, మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

వరంగల్ నగరంలో స్ధానిక ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్నారని, సీఎం అండతోనే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా దోచుకుంటున్నారని విమర్శించారు. కబ్జాలపై ఇక్కడి ఎమ్మెల్యేలకు కోచింగ్ ఇచ్చేది సీఎం కేసీఆరే అని ఎద్దేవా చేశారు. ఓరుగల్లు ప్రజలు కబ్జాకోరులను అడ్డుకుంటారని  తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌ లోనే కబ్జాలు పెరిగాయని బండి అన్నారు. వరంగల్ కార్పొరేషన్‌ పై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ సమస్యలపై బీజేపీ పోరాటం చేసిందని, అందుకే ప్రజల నుంచి అనూహ్య స్పందన కన్పిస్తోందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement