తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ యాత్ర’గా ఖరారు చేశారు. హైదరాబాద్ నగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద అధికారికంగా బీజేపీ నేతలు ప్రకటించారు. భాగ్యలక్ష్మి దేవాలయంలో బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు రాజా సింగ్, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, పార్టీ నేతలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజల తర్వాత ప్రజా సంగ్రామ యాత్ర పేరును ప్రకటించారు. పాతబస్తీ నుండి హుజూరాబాద్ వరకు బండి సంజయ్ యాత్ర కొనసాగిస్తారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నియంత్రుత్వ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఈనెల 24నుండి చేపట్టబోయే ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు రాష్ట్రం నలుమూలల నుండి ప్రతి ఒక్క కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు. పాతబస్తీని కేసీఆర్ ఎంఐఎం నేతలకు తాకట్టు పెట్టారని రాజాసింగ్ ఆరోపించారు. అధికారం కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ సిగ్గు లేకుండా సంతల్లో పశువుల్లా కొంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హుజురాబాద్ లో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో బండి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. వారం రోజుల పాటు ఆయన హుజురాబాద్ లో పర్యటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పాదయాత్ర చేయాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 9 నుంచే పాదయాత్ర చేయాలని తొలుత షెడ్యూల్ ప్రకటించారు. అయితే, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పాదయాత్రను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. విడతల వారీగా ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు. మొదటి విడతగా ఈ నెల 24వ తేదీ నుండి యాత్ర ప్రారంభం కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని తొలివిడత పాదయాత్ర ఈ రూట్ గుండా సాగనుంది. మొదటి విడత యాత్ర తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరో విడత యాత్రను బండి సంజయ్ నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: కాలేశ్వరం లో కీలక ఘట్టం.. మల్లన్న సాగర్ ను ప్రారంభించనున్న సీఎం