తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘’ప్రజా సంగ్రామ పాదయాత్ర’’ ప్రారంభమైంది. ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఆయన.. ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్, బీజేపీ నేతలు డీకే అరుణ, విజయశాంతి, అరుణ్‌సింగ్, లక్ష్మణ్‌తో కలిసి బండి సంజయ్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి తన యాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో బీజేపీ ప్రముఖులు పాల్గొంటున్నారు. పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన కమల సైన్యం.. మొదటి 10 రోజుల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం నాలుగు విడతల్లో ఈ యాత్ర జరుగనుండగా.. మొదటి విడత యాత్ర అక్టోబర్ 2న హుజూరాబాద్‌లో ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తొలిరోజు 10కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. చార్మినార్ దగ్గర మొదలై.. మదీన, అఫ్జల్ గంజ్, బేగంబజార్, మెజాంజాహీ మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్ మీదుగా.. మెహిదీపట్నం వరకు మెదటి రోజు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి యాత్రగా బయల్దేరి.. మెహిదీపట్నం చేరుకోనున్నారు. రాత్రికి పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో బస చేస్తారు.
పాదయాత్ర విజయవంతం కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం 29 కమిటీలను నియమించింది. యాత్ర ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు బండి సంజయ్ వెంట ఈ కమిటీ సభ్యులు ఉండనున్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ తో పాటు భోజన సదుపాయాలు, బస ఏర్పాట్లు చూసుకోనున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ, అవినీతి, కుటుంబ పాలన విముక్తికై పాదయాత్ర చేపడుతున్నట్టు ఇప్పటికే బండి సంజయ్ ప్రకటించారు. గత ఏడేళ్లలో కేసీఆర్ సర్కార్ తెలంగాణ ప్రజలకు చేసిందేమీలేదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పేలా.. ప్రజలను ఏకం చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. కాగా, ఈ పాదయాత్రలో జాతీయ నేతలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఇతర రాష్ట్రాల బీజేపీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చేవారికోసం రిజిస్ట్రేషన్ పద్ధతిని తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేక కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండిః ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా దడ.. విద్యార్థులను వెంటాడుతున్న వైరస్