నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత రియలైజ్ అయ్యారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. ఇవ్వాల (సోమవారం) తన అనుచరులతో జరిపిన భేటీలో మనుసులో మాటను వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ విషయంపై బీజేపీ నేతల నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు..
ఇక.. మునుగోడు ఓటమి తర్వాత బీజేపీ క్యాంపు ఆఫీసులో అనుచరులు, కార్యకర్తలతో రాజగోపాల్రెడ్డి ఇవ్వాల భేటీ అయినట్టు సమాచారం. అక్కడ ఆయన మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తనను కావాలనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ముఖ్య నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓడించారని కార్యకర్తలముందు వాపోయినట్టు తెలుస్తోంది. తాను గెలిస్తే ఎక్కడ వాళ్లకు పోటీగా మారుతానేమోనని బండి సంజయ్, ఈటల రాజేందర్ కలిసి తనను ఓడించారని అన్నట్టు సమాచారం.
ఎన్నికల్లో డబ్బుల తరలింపుపై పోలీసులకు లీకులు ఇచ్చింది వారేనని, గ్రౌండ్ రిపోర్టు తమకు అనుకూలంగా లేదని పార్టీ అధిష్ఠానానికి లేఖ కూడా రాశారన్నారు. అట్లా జేపీ నడ్డా బహిరంగ సభ పెట్టకుండా అడ్డుకున్నారని రాజగోపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం బీజేపీ నేతల నుంచి ఎట్లాంటి స్పందన రాలేదు. ఈ వార్త ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే.. ఈ వార్త మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.