Monday, November 25, 2024

ధ‌ర‌ణిలో నిషేధిత భూముల‌కు మోక్షం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పది రోజుల్లో ధరణి సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సిద్ధమవుతున్నది. హైకోర్టుకు ఇచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. పరిష్కారానికి కష్టంగా ఉండి క్లిషష్టతరంగా మారిన టీఎం 33 ససమస్యలపై కూడా తాజాగా దృష్టి సారించింది. ఇందుకు ప్రత్యేక టీమ్‌తో సీసీఎల్‌ఏలో కార్యా చరణ మొదలెట్టింది. అన్ని సెక్షన్ల నుంచి అధికారులు, సిబ్బందిని ఒకేచోట కూర్చి ధరణి ఫిర్యాదులు, సమస్యల పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా సీసీఎల్‌ఏ కార్యాలయం లో నిషేధిత భూముల తొలగింపు కసరత్తులో భాగంగా ఖాస్త్రా పహాణీ నుంచి ధరణి పహాణి రికార్డు వరకు పరిశీలిస్తున్నారు. 2020 సెప్టెంబర్‌కు ముందు రికార్డులు, ఆ తర్వాత రికార్డులను జాగ్రత్తగా పరిశీలించి స్వతహాగా నిషేధిత జాబితాలో నుంచి తొలగి స్తున్నారు. ఇలా పలు భూములు కార్డులో నిషేధిత జాబితాలో, ధరణిలో పట్టా భూములుగా ఉన్నాయి. ఈ భిన్నమైన పద్ధతిని సవరించేందుకు సర్కార్‌ ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ, ఎండోమెంట్‌, వక్ఫ్‌, భూదాన్‌ గ్రామకంఠం, ప్రభుత్వ ఆఫీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన భూములు, అటవీ, జంగ్లత్‌, బంజరు, సీలింగ్‌, అసైన్డ్‌ భూములను ఇందులో చేర్చారు.

ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తరతరాలుగా సాగుచేసుకుంటున్న పట్టాభూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, ధరణి పోర్టల్‌లో మార్పులు కోరుతూ ప్రభుత్వానికి లక్షలాదిగా దరఖాస్తులు చేరాయి. ఆయా భూముల వివరాలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తోంది. రైతుల ప్రమేయం లేకుండానే కలెక్టర్‌లు పంపిన భూముల వివరాలను ఆ వివరాల్లో ఉన్న భూముల రికార్డులను పరిశీలించి తహశీల్దార్లు ఇచ్చే నివేదికలు, వాటి ఆధారంగా కలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలు, ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు.

ధరణిలో ఇంకా పరిష్కారం కోరుతూ రైతులు నేరుగా చేసిన ఫిర్యాదులపై కదలిక వస్తున్నది. ఈ ఫిర్యాదులను జిల్లాల వారీగా వేరు చేసి కలెక్టర్లకు పంపి వివరాలను తీసుకున్నారు. వీటిని వీలైతే సుమోటోగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఈ పోర్టల్‌ రాకతో ఏళ్లనాటి భూ సమస్యలు తీరుతున్నాయి. రాష్ట్రంలోని సుమారు 60లక్షల మందికి చెందిన భూముల రికార్డులు క్లియర్‌గా ఉండటంతో రైతుబంధు, రైతుబీమా వంటివి నేరుగా అందుతున్నాయి. ధరణిలోని గ్రీవెన్స్‌ మ్యాడ్యూల్‌ ద్వారా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అధికారులకు విచక్షణాధికారాల కోతతో అక్రమాలు తగ్గాయి. అయినా పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం వంటివి అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. సీసీఎల్‌ఏ, రిజిస్ట్రేషన్‌, ఐటీ విభాగాలకు చెందిన అధికారులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ రెండు వెసులుబాట్లు వినియోగించుకునేలా సర్కార్‌ వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సత్వరమే ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
”ఆధీకృత ప్రతినిధి సంతకంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల యాజమాన్యంలోని ఆస్తుల జాబితాను అందించండి.. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సంతకం చేసిన వివిధ శాసనాల కింద నిషేధించబడిన ఆస్తుల జాబితాను సత్వరమే అందజేయండి, వీటిని రిజిస్ట్రేషన్‌ చట్టం 1908 ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిషేధిత భూములు, ఆస్తుల వివరాలను మరోసారి సమీక్షించి సుమోటోగా నిషేధిత జాబితాలోని తప్పులను సరిచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22(ఏ) కింద విక్రయించేందుకు వీలు లేకుండా నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన ప్రైవేటు భూములు, ఆస్తులను సదరు జాబితా నుంచి తొలగించేలా సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. అప్పట్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలోని కార్డ్‌ విధానంలో భాగంగా గెజిట్‌ నోటిఫై చేసిన ప్రభుత్వం నిషేధిత భూములు, ఆస్తుల వివరాలతో ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ధరణి రాకతో అనేక కోర్టు కేసులు, సర్వే నంబర్లలో బై నంబర్లు, ట్రిబ్యునల్‌ తీర్పులు, కాలువలు, చెరువులు, శిఖం, పోరంబోకు, ప్రభుత్వ భూములు, ఇతర అవసరాలకు భూ కేటాయింపులకు చెందిన సర్వే నంబర్లకు చెందిన భూములన్నీ ధరణిలో ప్రొహిబిషన్‌ లిస్టులోకి చేరాయి.

పార్ట్‌-బి లో లక్షల ఎకరాలు…
కొత్తగా సర్వే నంబర్ల ప్రకటన, ఎలాంటి సర్వే నంబర్లు లేని భూముల వివరాలు, అసలు రికార్డుల్లోనే లేని గ్రామాలు, ఖాతా నంబర్లు లేకుండా ఉన్న భూములు, పట్టా ఒకరిదైతే పొజిషన్‌లో మరొకరు, అమ్మినా యాజమాన్య హక్కు మారని వివరాల వంటివి దాదాపు 54 అంశాలతో కూడిన అక్రమాల్లో మొత్తం 2కోట్ల 40లక్షల 71 వేల 495 ఎకరాల భూ విస్తీర్ణంలో 74లక్షల 42వేల 910 ఎకరాల భూ విస్తీర్ణం వివాదాస్పదమేనని గుర్తించి పార్ట్‌-బిలో చేర్చారు. మొత్తంగా కోటి 76లక్షల 81వేల 621 ఎకరాల భూమిని వివాదరహితంగా తేల్చారు. మొత్తం క్లియర్‌ చేసిన భూముల వివరాల శాతం భూ రికార్డుల ప్రక్షాళన పూర్తినాటికి 85.61శాతానికే పరిమితమైంది.
70లక్షల కమతాలకు చెందిన 57.33 లక్షల కమతాలు వివాదరహితంగా తేల్చారు. అయితే వీటిలో 49.94 లక్షల పాస్‌ పుస్తకాలను ముద్రించారు. ఇందులోనే 42 లక్షల పాస్‌ పుస్తకాలే పంపిణీ చేశారు. మరో 7లక్షల పాస్‌ పుస్తకాల్లో ముద్రణా దోషాలు, పేర్లు, కమతాలు, ఖాతాలు, లింగ బేధాలు, విస్తీర్ణం వంటి తప్పులు దొర్లాయని గుర్తించి పంపిణీ చేయకుండా ఆపేశారు. మరో 1.76లక్షల పాస్‌ పుస్తకాలు పట్టాదార్లు రాకపోవడంతో నిలిపేశారు. మరో 6 లక్షల తప్పులు దొర్లిన పాస్‌ పుస్తకాలను తిరిగి ముద్రించి జిల్లాలకు చేరవేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement