తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ చేసిన విమర్శలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. కరోనాపై పోరులో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు మద్దతు, బీజేపీ ఎంపీ అర్వింద్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎంపీ బండి సంజయ్ తన విధానం మార్చుకోవాలని తలసాని హెచ్చరించారు. బాధ్యతగా మాట్లాడితే బాగుంటుంది అని సూచించారు. కరోనా విషయంలో దేశ ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రుల విషయంలో బీజేపీ ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖపై సీఎం కేసీఆర్ మానిటరింగ్ చేస్తున్నారు అని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ వ్యవహారం సీఎం కేసీఆర్ పరిధిలో ఉందన్నారు.
దేశ ప్రయోజనాలను గాలికి వదిలేసింది బీజేపీ ప్రభుత్వం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కరోనా విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేలా మాట్లాడితే మంచిది. కొవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్, హెల్త్ సెక్రటరీతో నిత్యం మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా కట్టడికి సీఎం తీవ్రమైన కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రిని ప్రశంసించాల్సింది పోయి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. చిల్లర మాటలు మాట్లాడినందుకే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఘోరంగా ఓటమి చవిచూసినప్పటికీ, వారికి బుద్ధి రాలేదు. నోరు తమ మీద పారేసుకోవడం మాని.. దమ్ముంటే రెమ్‌డెసివిర్, ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరతపై కేంద్రాన్ని నిలదీస్తే బాగుంటుందని సూచించారు.