Tuesday, November 26, 2024

బాలానగర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన కార్మికురాలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నిత్యం రద్దీ ఉండే బాలానగర్ ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. ఈ ఫ్లై ఓవర్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అయితే వంతెన నిర్మాణ సమయంలో పనిచేసిన కార్మికురాలు శివమ్మతో మంత్రి ఫ్లై ఓవర్ ఓపెనింగ్ చేయించారు. శివమ్మతో కొత్త ఫ్లైఓవర్‌కు రిబ్బన్ కటింగ్ చేయించి అందరికీ షాక్ ఇచ్చారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మట్లాడుతూ..  బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ ఫ్లై ఓవ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బాలాన‌గ‌ర్ వాసుల 40 సంవ‌త్స‌రాల క‌ల నెర‌వేరిందన్నారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌తో బాలాన‌గ‌ర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఇప్పుడు ఈ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రావ‌డంతో ట్రాఫిక్ క‌ష్టాలు పూర్తిగా తొల‌గిపోయాయి. కూకట్‌పల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయన్నారు. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ను విస్తరిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో రూ.100 కోట్లతో రోడ్లు, అండర్ పాసులు నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా భవిష్యత్తులో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు జేబీస్ నుంచి స్కైవే కోసం ప్లాన్ చేశామని, కేంద్రం నుంచి అనుమతి లేకపోవడంతో పెండింగ్ లోనే ఉందని కేటీఆర్ తెలిపారు.

కాగా, నిత్యం బాలానగర్ ప్రాంతంలో ప్రజలను ట్రాఫిక్ కష్టాలు ఇబ్బంది పడుతున్నాయి. కూకట్‌పల్లి, సికింద్రాబాద్ , జీడిమెట్ల వెళ్లే రహదారి పారిశ్రామిక కేంద్రం కావటంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. బాలానగర్‌లో ట్రాఫిక్ దాటితే చాలు అని ప్రజలు అనుకుంటారు. ఇక్కడి ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలకు తీర్చేందుకు ఫ్లై ఓవర్ ను నిర్మించారు. 2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 385 కోట్ల రూపాయలతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. బ్రిడ్జి ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫతేనగర్‌, మరొకటి బాలానగర్‌. రెండు డివిజన్లతో వందలాది పరిశ్రమలు ఉన్నాయి . దీంతో నిత్యం కార్మికులు, లారీలు , ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు. వెడల్పు 24 మీటర్లు. 26 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మించారు. ఈ పైవంతెనకు ఓ ప్రత్యేకత ఉంది. హైదరాబాద్‌లో 6 లేన్లతో నిర్మించిన మొట్టమొదటి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement