మనిషికి చావు ఎప్పుడు ఎలా వస్తుందో ముందుగా ఎవరు చెప్పలేరు. అప్పటి వరకు హుషారుగా వ్యక్తి.. ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వీడుస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరు విధి నిర్వహణలో ఉండగానే ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆడుతూపాడుతూ కన్నుమూసిన ఘటనలు లేకపోలేదు. అయితే, ఓ స్వామీజీ తన పుట్టినరోజు నాడే కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తన జన్మదిన వేడుకల్లోనే ప్రాణాలు విడిచారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో బలోబలం మఠం ఉంది. ఆ పీఠాధిపతి అయిన సంగనబసవ మహాస్వామీజీ.. ఇటీవల జరిగిన తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడుతున్న ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో కూర్చున్న కుర్చీలోనే తల వెనక్కి వాల్చి కన్నుమూశారు. పక్కనే ఉన్న స్వామీజీ, భక్తులు వెంటనే అప్రమత్తమైనప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందారు. స్వామీజీ ప్రసంగాన్ని చిత్రీకరిస్తున్న భక్తుల మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యం రికార్డు అయ్యాయి. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.