బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు.. అంటూ టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఆ ఉక్కు కర్మాగారం కేంద్రం నుంచి పొందటం మన హక్కు అంటూ గుర్తు చేశారు. ఈ ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందునుంచి ఉన్న డిమాండ్ అని నామా వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 లో పేర్కొన్న ప్రకారం బయ్యారం ఉక్కు పరిశ్రమను తెలంగాణకు ఇవ్వాలని గుర్తు చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వకుండా మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ భాద్యత కేంద్రంపైనే ఉందని ఆయన నొక్కి చెప్పారు.
బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గిరిజన బిడ్డలకు ఆందోళన కల్గిస్తాయన్నారు నామా నాగేశ్వర్రావు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు, కేంద్రం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా తాము ఆందోళన చేపడుతామన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై గత ప్రభుత్వం 2009లో 69 జీఓ, 2010లో మరో జీఓ ఇచ్చిందని, అయితే ప్రైవేటుకు అప్పగిస్తామంటే రాష్ట్రం తరఫున ఒప్పుకోకపోవడంతో ఆ జీఓలు రద్దు చేశారన్నారు. అదే సమయంలో తెలంగాణ సంపద తెలంగాణకే దక్కాలని న్యాయ స్థానం సైతం ఆదేశించిందని గుర్తు చేశారు. బయ్యారంలో 40 నుంచి 60 శాతం ఐరన్ ఉందని కేంద్ర సంస్థలు సర్వే ద్వారా తెలిపాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కావాలనే ఉక్కు పరిశ్రమ ఇవ్వడం లేదన్నారు.
హైవేలను కలుపుకొని పట్టణాలకు రింగ్ రోడ్ల ఏర్పాటుకు వివిధ రాష్ట్రాలకు కేంద్రమే నిధులిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి భూమి విలువ 50 శాతం ఇవ్వాలని మెలిక పెడుతోందని ధ్వజమెత్తారు. మిషన్ భగీరథకు రూ.24వేల కోట్లు నిధులు ఇవ్వొచ్చని నీతి అయోగ్ చేసిన ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు నామా. హర్ ఘర్ జల్ పథకానికి దేశంలోని అన్ని రాష్ట్రాలకు నిధులిస్తున్న విషయం గుర్తు చేశారు. తెలంగాణకు ఎందుకు మొండి చేయిచూపుతున్నదన్న విషయంపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు పేర్కొన్నారు. మైనింగ్ పై అధికారాలన్నీ కేంద్రం దగ్గర ఉన్నాయని అన్నారు. సింగరేణిలో రాష్ట్రం వాటా 51శాతం ఉండగా, కేంద్రం వాటా 49 శాతాన్ని కూడా మేమే తీసుకుంటామని కేంద్రాన్ని కోరితే ఏమాత్రం స్పందించడం లేదన్నారు. కేంద్రం దగ్గర ఉన్న అధికారాలు రాష్ట్రానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏమీ తీసుకురాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనీసం బయ్యారం పరిశ్రమ తెచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ఆయనకు దండవేసి దండం పెడతామని ఎంపీ నామ వ్యాఖ్యానించారు. బయ్యారం స్టీలు పరిశ్రమ వస్తుందని గతంలో కేంద్రమే పేర్కొందని గుర్తు చేసారు. ప్రస్తుతం అది సాధ్యం కాదంటే మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేదా కేంద్రం నిర్ణయమా తెలపాలని డిమాండ్ చేశారు.