Tuesday, November 26, 2024

మదనపల్లె జంట హత్యల కేసు.. నిందితులకు బెయిల్

ఏపీలో సంచలనంరేపిన మదనపల్లె జంట హత్య కేసులో నిందితులను కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూఢ నమ్మకాలతో సొంత కూతుళ్లనే హత్య చేసిన తల్లిదండ్రులు  పురుషోత్తం నాయుడు, పద్మజలకు మదనపల్లె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మానసిక సమస్యలతో బాధపడుతున్నా పద్మజా, పురుషోత్తంలకు తొలుత తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆ తర్వాత విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు. అనంతరం వారిని ఇటీవలే మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో నిందితులకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.  

పురుషోత్తమ నాయుడు, పద్మజ దంపతులు ఈ ఏడాది జనవరి 24న చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో తమ ఇద్దరు కూతుళ్లను చంపిన విషయం తెలిసిందే. మూఢ విశ్వాసాలలో మునిగిన దంపతులిద్దరూ కూతుళ్లతో కలిసి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్ద కూతురు అలేఖ్యను పూజ గదిలో తండ్రి పురుషోత్తం నాయుడు చంపేశాడు. చిన్న కూతురును డంబెల్ తో తల్లి కొట్టి చంపింది. ఈ కేసులో ఏ1గా తండ్రి పురుషోత్తం, ఏ2 తల్లి పద్మజగా పోలీసులు చేర్చారు. ఈ జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో వారిని జైలుకు తరలించారు. రెండు రోజులకే పద్మజ అరుపులు, కేకలతో ఖైదీలు భయపడిపోయారు.

మదనపల్లె సబ్ జైలులో ఉన్న పద్మజ దెబ్బకు జైల్లో ఖైదీలు వణికిపోయారు. ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోంది.. శివుడు వస్తున్నాడు.. కలియుగం అంతమవుతుంది అని పెద్దగా కేకలు వేశారు. పద్మజ ఉంటున్న బ్యారక్‌ లో మహిళా ఖైదీలు రాత్రిళ్లు నిద్రించాలంటే భయపడ్డారు. పద్మజ దెబ్బకు ఆందోళనకు గురైన సహచర ఖైదీలు ఆమెను ప్రత్యేక గదికి తరలించాలని మొర పెట్టుకున్నారు. పురుషోత్తంనాయుడు కూడా ఒంటరిగా కూర్చొని ఒక్కోసారి ఏడ్చారు. దీంతో జైలు సిబ్బంది అధికారులతో మాట్లాడి తిరుపతి రుయాకు తరలించగా.. మానసిక వైద్యనిపుణులు వారిని చికిత్స నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తరలించాలని రిఫర్‌ చేశారు. నిందితులు పురుషోత్తం, పద్మజలను విశాఖ తరలించారు.. ఇద్దర్ని విశాఖ మానసిక చికిత్సాలయంలో చేర్చారు. ఇద్దరు కోలుకోవడంతో మార్చ్ 29న డిశ్చార్ చేశారు. అనంతరం ఇద్దర్ని చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో పశ్చాత్తాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement