ప్రతిష్ఠాత్మక స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ఈ సారి సరికొత్తగా మార్కెట్లోకి రావాలని ట్రై చేస్తోంది. ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు ఎయిర్ పాడ్స్ ప్రో 2, కొత్త యాపిల్ వాచ్‌లను సెప్టెంబర్ ఈవెంట్‌లో లాంచ్ చేయనుంది. అయితే ఈ ప్లాన్‌లు భారీ మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. చైనాలో కరోనా కేసులు పెరగడం, చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్ కారణంగా ఆ దేశంలోని యాపిల్ సప్లయర్లు విడిభాగాలను సప్లయ్ చేయడంలో లేట్ అవుతోంది. దీంతో యాపిల్ కొత్త ఉత్పత్తుల లాంచ్ కూడా ఆలస్యం అయ్యే చాన్స్ ఉందని టెక్ అనలిస్టులు, మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, ఐఫోన్ 14 ప్రోలో అప్‌గ్రేడ్ చేసిన ప్రోమోషన్ డిస్‌ప్లే ప్యానెల్ ఉంటుందని సమాచారం. ఇది ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేను కూడా సపోర్ట్ చేయనుంది. ఐఫోన్ల విడిభాగాలను సప్లయ్ చేసే కంపెనీల్లో ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ పెద్ద సంస్థలని తెలుస్తోంది. ప్రస్తుతం చైనాలో లాక్‌డౌన్ కారణంగా ఈ కంపెనీలు వాటి ఫ్యాక్టరీలు రన్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉత్పత్తి కూడా ఆలస్యం అవుతుందని సమాచారం.
ఒకవేళ ఈ ఆలస్యం ప్రభావం స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిపై పడితే కనుక యాపిల్ 8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.62,097 కోట్లు) రెవెన్యూని కోల్పోతుందని టెక్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా కొత్త ఐఫోన్ మోడల్స్ అన్నీ జూన్ నాటికి ఇంజినీరింగ్ వెరిఫికేషన్ టెస్ట్ (ఈవీటీ) స్టేజ్‌లోకి జూన్‌లో ఎంటర్ అవుతాయి. కానీ, వీటిలో ఒక మోడల్ మాత్రం ఆశించిన టైం కంటే కనీసం 3 వారాలు ఆలస్యం అవుతుందని అంచా ఉంది. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ప్రొడక్షన్ స్టేజ్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. కాగా, అనుకున్న షెడ్యూల్‌కు లాంచ్ కావాలంటే మాత్రం లాక్‌డౌన్ నుంచి కోలుకుని సప్లయ్ చైన్‌ను వేగంగా రీస్టోర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫోన్‌ను ముందే లాంచ్ చేసినా.. సేల్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కూడా మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు.