Wednesday, November 20, 2024

అంటార్కిటికాలో అద్భుతం.. ఐస్ రన్ వే పై ఎయిర్ బస్ ల్యాండింగ్

కేప్ టౌన్ : ఎప్పుడూ మంచుతో నిండి ఉండే అతిశీతల శ్వేతఖండం అంటార్కిటికాలో ఓ అద్భుతం జరిగింది. గడ్డకట్టిన మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతంలో తొలిసారిగా ఓ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ధవళరాజ్యంలో మునుముందు పర్యాటకం కొత్త పుంతలు తొక్కడానికి ఈ ప్రయోగం ఊతమివ్వనుంది. అంటార్కిటాలో గడ్డకట్టిన మంచు రన్వేపై ఎ340 వాణిజ్య విమానం నవంబర్ మొదటివారంలో ల్యాండ్ అయిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి నవంబర్ 2వ తేదీన ఈ ఎయిర్ బస్ టేకాఫ్ తీసుకుంది. అక్కడికి సరిగ్గా 2,500 నాటికల్ మైళ్లు (4,630 కి.మి) దూరంలోని అంటార్కిటికాకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బ్లూ గ్లేసియల్ ఐస్ తో ఏర్పాటు చేసిన రన్ వే సురక్షితంగా ల్యాండ్ అయింది.

విమానయానంలో ప్రఖ్యాతిగాంచిన హై ఫ్లై అనే సంస్థ ఈ విమానాన్ని ప్రయోగాత్మంగా నడిపి ఔరా అన్పించింది. 190 టన్నుల బరువున్న ఈ విమానం సాహసయాత్ర ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసిందని కాక్ పిట్ పైలెట్లు, సిబబ్ది చెప్పారు. భారీఎత్తున సరుకులతో కూడిన తమ విమానం ల్యాండ్ అయినపుడు ఏర్పడే కుదుపులను తట్టుకునేలా మంచు రన్ వేను రూపొందించారని పైలట్ కెప్టెన్ మిర్ పురి చెప్పారు. ఎన్నో జాగ్రత్తలతో రూపొందించడంవల్లే ప్రమాదం జరగలేదని, లేనిపక్షంలో ఈ భారీ విమానం మంచు రన్ వే నుంచి అదుపుతప్పి జారిపోయేదని అన్నారు. ఈ విమానాన్ని నడిపిన పైలట్లు ప్రత్యేకమైన కళ్లజోళ్లను వాడారు. మంచుతో ఎదురుగా ఏముందో కన్పించే అవకాశం ఉండదు.

క్షణక్షణం వాతావరణం మారిపోతూండటం అంటార్కిటికాలో మామూలే. అదీగాక రన్ వే మరీ పొడవుగా ఏమీ లేదు. కేవలం 50 ల్యాండింగ్ స్ట్రిప్స్ నిడివి మాత్రమే ఉంది. అంత చిన్న ఐస్ రన్ వే పై ఎంత వేగంతో, ఎంత కుదుపుతో 190 టన్నుల విమానాన్ని ల్యాండింగ్ చేయాలో అంచనా వేయడంలో పైలట్లు విజయం సాధించారు. అందువల్లే సురక్షితంగా ప్రయోగం విజయవంతం అయింది.పైలట్ మిర్ పురి బృందం సాధించిన సాహసోపేత ప్రయోగం ఫలితంగా మునుముందు ఈ మారుమూల శ్వేతఖండానికి పర్యాటకులు పోటెత్తే అవకాశం ఉంది. ఇక్కడ ఓ కొసమెరుపు ఉంది. ఐస్ రన్ వేపై ల్యాండ్ అయిన తరువాత కేవలం 3 గంటల్లో విమానంలోని మొత్తం సరుకులను అన్ లోడ్ చేసి రివ్వున తిరుగుపయనమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement