నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సర్వాయి పాపన్న డాక్యుమెంటరీ బెస్ట్ సినిమాటో గ్రహీ అవార్డ్ దక్కించుకుంది. నోయిడాలో ఈ నెల 29న జరగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు గోల్కొండను జయించిన బహుజన వీరుడు పావన్నపై రూపొందించిన “సర్వాయి పాపన్న” డాక్యుమెంటరీ ఎంపికై బెస్ట్ కెటగిరీ అవార్డు పొందింది. సుపధ క్రియషన్స్ బ్యానర్ పై కత్తి చేతన్ దర్శకత్వంలో పొన్నం రవిచంద్ర రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి సినిమాటోగ్రఫీ అందించింది గౌని తిరుపతి.
కాగా, ఈ ఫెస్టివల్ లో 65 డాక్యుమెంటరీలు పోటీకి వచ్చాయని, వాటిలో 17 డాక్యుమెంటరీలు ప్రదర్శనకు ఎంపికైయాయని నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ప్రకటించారు.
ప్రదర్శనకు ఎంపికయిన 17 డాక్యుమెంటరీలలో 5 భారత దేశానికి చెందినవి కాగా, మిగతా డాక్యుమెంటరీలు అమెరికా, చిలి, జర్మనీ, బెల్జియం, చైనా, స్పేయిన్ దేశాలకు చెందినవని నిర్వహకులు తెలిపారు. 8 దేశాల డాక్యుమెంటరీలలో సర్వాయి పాపన్న ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డ్ దక్కించుకోవడం తెలంగాణాకే గర్వకారణం. సర్వాయి పాపన్న డాక్యుమెంటరీకి అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన విజువల్ ని అందించిన సినిమాటొగ్రాఫర్ తిరుపతి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు, తెలంగాణ పాటలు, డాక్యుమెంటరీలకు, వెబ్ సీరీస్ లకు పని చేశారు. ముఖ్యంగా తెలంగాణ పాటను అందంగా ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో తిరిపతిని ఒక్కరుగా చెప్పుకోవచ్చు.
డాక్యుమెంటరీ లో పాపన్న చరిత్రను చారిత్రక ఆధారాలతో చూపించారు. ఆయన నిర్మించిన కోటలు, జయంచిన కోటలు అన్ని అద్భుతంగా చూపించారు. అంతర్జాతీయ స్ఠాయిలో పాపన్న చరిత్రను మరోసారి బయటకు తీసుకువచ్చిన డాక్యుమెంటరీ ఇది.
18వ శతాబ్ధంలో జె ఎ బోయల్ ఆయన చనిపోయిన 2 శతాబ్ధాల తర్వాత ప్రజల నాల్కుల మీద నుంచి ఏరి పాపన్న చరిత్రను వెలికి తీశాడు. ఆయన తర్వాత రిచ్చర్డ్ ఈటెన్ దక్షిణాది సామాజిక రాజకీయ విప్లవ యోధుడి చరిత్రను ఆధారాలతో
సహా ప్రపంచం ముందుకు తీసుకు వచ్చారు.
పాపన్న వరంగల్ జిల్లా ఖిలాషపూర్ తాటికొండ గ్రామంలో 1650 ఆగష్టు 18న పుట్టారు. తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి సర్వమ్మ అన్నీ తానై పెంచింది. జమిందారుల అరాచకాలను, కుల వివక్షను, కొన్ని కులాలే పాలించే సంస్కృతి పట్ల చిన్నతన్నంలోనే పాపన్నకు ఆలోచన మొదలైంది. పరాయిపాలనలో బానిసలుగా బతకడం కంటే ధిక్కరించి స్వయంపాలన చేసుకుందాం అని పాపన్న నినదించాడు. సామాజిక వ్యవస్థ గురించి ఒక స్పష్టమైన ఆలోచనలతో, సిద్ధాంతంతో ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. గౌడ వృత్తిలోనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. అనేక కులాలను సమన్వయం చేయడమే కల్లుగీత వృత్తి లక్షణమన్నారు. ఒక్క గౌడ కులంలోనే కాదు ప్రతి కులంలోనూ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పారు.
రాజ్యం ఎవరి సొత్తు కాదని ప్రజల భాషలో వివరించారు. పాపన్న తిరుగుబాటు చేసింది రాజ్యం మీద కాదు రాజ్య స్వభావం మీద. ఆధిపత్య సంస్కృతి మీద. పాపన్న భౌద్ధ సంస్కృతికి పట్టం కట్టాడు. అప్పటికే ఉన్న గుడులలో కూడా దళిత బహుజనులకే అప్పజెప్పాడు. గ్రామదేవతల సంస్కృతిని తిరిగి బతికించాడు. బౌద్ధ రాజ్యం అంటే రాజ్య సంపదలో అందరికీ వాటా ఉండటమే… బహుజన రాజ్యం అంటే పరిపాలనలో అందరికీ సమాన హక్కును కల్పించడమే… ఈ సాంప్రదాయాలను పాపన్న మొదటి నుంచి పాటిస్తూ వచ్చారు… అయితే ఇక్కడ స్థానికంగా స్థిరపడిన జమీన్ దారులు మొఘల్ పాలకులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ వచ్చారు. కింది కులం నుంచి వచ్చిన పాపన్న ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయారు.