Friday, November 22, 2024

Congress Crisis: గెహ్లాట్‌ను పోటీ నుంచి తప్పించండి, అతను ఆ పదవికి అన్​ఫిట్​.. సోనియాకు సీడబ్ల్యూసీ లేఖ!

రాజస్థాన్‌ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం దృష్ట్యా హై కమాండ్​ నుంచి పరిశీలకుల బృందం వెళ్లింది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో అధిష్ఠానం నిలిపేందుకు ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో కొత్త ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలట్‌ను నియమించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలో అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఒక్కసారిగా గెహ్లాట్‌ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో పాటు ఆదివారం రాత్రి మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడ్డారు. అయితే, ఈ విషయంపై కాంగ్రెస్‌ వర్గింగ్‌ కమిటీ సభ్యులు తీవ్రంగా పరిగణించారు.

ఈ మేరకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లాట్‌ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఆయనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని, పార్టీ అగ్రనాయకత్వం ఆయన అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని ఆ లేఖలో సీడబ్ల్యూసీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆయనకు బదులుగా మరొకరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని సూచించారు. అయితే, తన వారసుడిగా ఎవరు సీఎం అవుతారనే దానిపై తుది నిర్ణయం తీసుకోక ముందే.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి యత్నిస్తున్న గెహ్లాట్‌కు ఈ లేఖ ఎదురుదెబ్బలాంటిదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement