విలాసవంతమైన జీవితం పట్ల విరక్తితో 28ఏళ్లకే సన్యాసం పుచ్చుకోనున్నాడు మధ్యప్రదేశ్ కు చెందిన ప్రన్సుఖ్ కాంతేడ్ అనే యువకుడు ..సైంటిస్టు ఉద్యోగం, కోట్లలో జీతం, అమెరికా జీవితం… ఇవన్నీ వదలుకుని సన్యాసిగా మారనున్నాడు.ప్రన్సుఖ్ తో పాటు మరో ఇద్దరు యువకులు కూడా సన్యాసం తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. వీరికి సన్యాస దీక్ష అందించే కార్యక్రమానికి 50 మందికి పైగా జైన సాధువులు రానున్నారట. ప్రన్సుఖ్ కాంతేడ్ ఇంజినీరింగ్ అనంతరం 2016లో అమెరికా వెళ్లాడు. అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేసి డేటా సైంటిస్టుగా ఉద్యోగం సంపాదించాడు.
ఏడాదికి రూ.1.25 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం అతడికి ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. డబ్బుతో వచ్చే విలాసవంతమైన జీవితం పట్ల అతడికి విరక్తి కలిగింది. దాంతో, ఉద్యోగాన్ని, అమెరికాను వదిలేసి భారత్ తిరిగొచ్చేశాడు. గతేడాది స్వదేశానికి తిరిగొచ్చిన ప్రన్సుఖ్ జైన సన్యాసంపై ఆసక్తి చూపాడు. ఈ క్రమంలో డిసెంబరు 26న జైన సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు. జైన మత గురువు జినేంద్ర ముని వద్ద సన్యాస దీక్ష తీసుకోనున్నాడు. అందుకు అతడి కుటుంబ సభ్యులు ఎవరూ అభ్యంతరపెట్టడంలేదు. పైపెచ్చు, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.