Friday, November 22, 2024

India | శ్రీనగర్​ హైవేపై విరిగిపడుతున్న మంచు చరియలు.. జోజిలా పాస్​ వద్ద హైవే క్లోజ్​ (వీడియో)

శ్రీనగర్-కార్గిల్ హైవేపై మంచుకొండలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రూట్​లో వెళ్లే రెండు వాహనాలు వాటిని ఢీకొట్టి రోడ్డుపై నుండి దిగువకు హిమపాతంలో జారిపోయాయి. ఇవ్వాల (సోమవారం) జోజిలా పాస్ వద్ద పాణిమఠ కెప్టెన్ మోడ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న భారత సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. ఇండియన్ ఆర్మీకి చెందిన రెస్క్యూ టీమ్‌తో పాటు వైద్య బృందాలు పర్యాటకులను కాపాడడంలో నిమగ్నమయ్యాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

శ్రీనగర్-కార్గిల్ హైవేపై మంచుకొండలు విరిగిపడి, టూరిస్టుల వాహనాలకు ప్రమాదానికి గురైన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఇండియన్​ ఆర్మీ రెస్క్యూ టీమ్​ వెల్లడించింది. ప్రమాదంలో గాయపడిన వారిని వాహనాలలో తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో వాహనాలను బయటకు తీసుకెళ్లలేకపోతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో ప్రత్యేక శిక్షణ పొందిన అవలాంచె రెస్క్యూ టీమ్‌తో పాటు వైద్య బృందాలు నిమగ్నమై ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. రెస్క్యూ టీమ్‌లు ఎమర్జెన్సీ మెడికల్ కిట్‌లతో రెడీగా ఉన్నాయని, ముందస్తు రెస్క్యూ కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.

సహాయక చర్యలు సోమవారం రాత్రి దాకా కొనసాగుతున్నాయి. ఈ వాహనాలు శ్రీనగర్‌ నుంచి కార్గిల్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత శ్రీనగర్-కార్గిల్ హైవేని తాత్కాలికంగా క్లోజ్​ చేశారు. ముఖ్యంగా జోజిలా పాస్ వద్ద మంచు కారణంగా హైవేపై మంచును తొలగించే ఆపరేషన్‌కు కూడా ఆటంకం కలుగుతోంది. ఇక.. జమ్మూ కాశ్మీర్ విపత్తు నిర్వహణ అథారిటీ (JKDMA) రానున్న 24 గంటలపాటు హిమపాతం హెచ్చరికను జారీ చేసింది. బారాముల్లాలో రాబోయే 24 గంటల్లో ప్రమాదకర స్థాయిలో హిమపాతం సంభవించే అవకాశం ఉందని తెలపింది. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement