తెలంగాణ కేబినెట్ భేటీలో భాగంగా సీఎం కేసీఆర్ మంత్రివర్గ సహచరులకు పలు సలహాలు, సూచనలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మనపై పడబోతోందని చెప్పిన సీఎం.. ఎలాంటి తప్పులకు అవకాశాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సూచించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరును యాది చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్… నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు ఇక మనపై పడతాయని, ఆ సంస్థలకు చాన్స్ ఇచ్చేలా ఎట్లాంటి పనులు చేయరాదని హితబోధ చేశారు సీఎం కేసీఆర్. బీజేపీ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులకైనా అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. సీబీఐ విచారణల విషయంలో రాష్ట్రాల అనుమతి తప్పనిసరి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం చేద్దామని కూడా తెలిపారు. ఇప్పటికే కేంద్ర మంత్రుల దండయాత్ర మొదలైందని, భవిష్యత్తులో మరింత పెరుగుతుందన్నారు. ఇట్లాంటి సమయంలో రాష్ట్ర మంత్రులు అలసత్వంగా ఉండొద్దని సూచించారు.