హైదరాబాద్ సిటీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమానుష ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినితో హాస్టల్ వార్డెన్ కృష్ణ అసభ్యంగా ప్రవర్తినించాడు. రాత్రి సమయంలో పక్కన పడుకుని లైంగికంగా వేదిస్తున్నట్టు ఆ బాలిక తన తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
గత ఆరు రోజులుగా రాత్రి సమయంలో తన పక్కన పడుకుని వేధిస్తున్నాడని, భయంతో తల్లితండ్రులకి ఆ విద్యార్థిని చెప్పింది. ఈ ఒక్క స్టూడెంట్తోనే కాకుండా మరికొంతమంది విద్యార్థులను కూడా హాస్టల్ వార్డెన్ లైంగిక వేధింపులకు గురిచేసినట్టు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో అతడిని స్కూల్ నుండి ప్రిన్సిపల్ బయటికి పంపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ స్కూల్ వద్ద విద్యార్థినుల తల్లితండ్రులు, విద్యార్ది సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనిపై ఎంఈవో విచారణ చేపట్టినట్టు సమాచారం. కాగా, ఈ అఘాయిత్యానికి కారణమైన హాస్టల్ వార్డెన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.