తెలంగాణలో సంచలనం రేపిన గిరిజనుడిపై దాడి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. దొంగతనం కేసులో విచారణ పేరుతో గిరిజన యువకుడిని చిత్రహింసలు పెట్టిన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్( ఎస్ ) ఎస్సై లింగంపై వేటు పడింది. లింగంను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. గతంలోనూ ఈయన ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. ఉప్పల్ ఎస్సైగా పనిచేసిన లింగం.. ఓ కేసులో సస్పెండ్పై సూర్యాపేటకు బదిలీ అయ్యారు. లాక్ డౌన్ లో ఓ నర్సు భర్తపై చేయి చేసుకోవడం సంచలనమైంది.
దొంగతనం ఆరోపణలతో ఓ గిరిజనుడిని పోలీసులు దారుణంగా కొట్టారని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) పోలీస్‌స్టేషన్ ఎదుట గురువారం గిరిజనులు ఆందోళనకు దిగిన విషయం విదితమే. ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్‌లోని ఓ బెల్ట్ దుకాణంలో గత నెలలో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మండలంలోని రామోజీతండాకు చెందిన నవీన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్టు ఒప్పుకొన్నాడు.
తనతోపాటు అదేతండాకు చెందిన గుగులోతు వీరశేఖర్ కూడా ఉన్నట్టు చెప్పడంతో బుధవారం రాత్రి అతన్ని ఎస్సై లింగం స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం వీరశేఖర్ అస్వస్థతకు గురయ్యాడని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. ఇంటికి వెళ్లిన తరువాత వీరశేఖర్ పరిస్థితి విషమించడంతో గురువారం అతని కుటుంబసభ్యులు 200 మంది గ్రామస్థులతో కలిసి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఎస్సై తనను చితకబాదాడని, కాళ్ల మీద పడ్డా కనికరం చూపలేదని బాధితుడు ఆరోపించారు. ఎస్సైని వెంటనే విధుల నుంచి తొలగించాలని బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు ఎస్సైపై బదిలీ వేటు వేశారు.
ఇది కూడా చదవండి: వరి కోసం బీజేపీ మెడలు వంచుతాం: KTR