Friday, November 22, 2024

BREAKING: 5 రాష్ట్రాల ఎన్నికలపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయని సీఈసీ స్పష్టం చేసింది. దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు కేసులు పెరగడంతో ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పష్టత ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర వెల్లడించారు.

రాజకీయ పార్టీలన్నీ సమయానికే ఎన్నికలు నిర్వహించాలని కోరాయని సీఈసీ తెలిపారు. కోవిడ్-19 నిబంధనలను అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారని సుశీల్ చంద్ర చెప్పారు. కోవిడ్ పరిస్థితులుతో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచుతామని వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ లో అన్ని ఓటింగ్ బూత్‌ల వద్ద వీవీ పాట్ లను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి దాదాపు లక్ష పోలింగ్ బూత్‌లలో ప్రత్యక్ష వెబ్‌ కాస్టింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

కాగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూలు జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు కోవిడ్ పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఇప్పటికే ఆదేశించారు.

మరోవైపు ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి వల్ల ఎన్నికలను ఒకటి లేదా రెండు నెలలు వాయిదా వేయాలని అలహాబాద్‌ హైకోర్టు ఇటీవలే ఈసీని కోరింది. ఎన్నికల సభలు, ర్యాలీలు నిషేధించాలని కూడా కేంద్రాన్ని అభ్యర్థించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement