భూపాలపల్లి(ప్రభ న్యూస్): జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి (ఆంధ్రప్రభ) జర్నలిస్ట్ యాంసాని రాజుపై సోమవారం పలువురు హత్యాయత్నానికి పాల్పడ్డారు. రిపోర్టర్ని చంపేందుకు యత్నించి దాడి చేయడంతో బాధితుడికి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతడిని ప్రస్తుతం ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మొగుళ్ళపల్లి మండలంలో వార్తా సేకరణకు వెళ్లి పరకాలకు తిరిగి వస్తున్న క్రమంలో తనపై దాడి చేశారని తెలిపాడు. నాగారం పరకాల మలక్ పేట కమాన్ మధ్యలో మొగులపల్లిలో వైద్యాధికారిగా పనిచేస్తున్న వైద్యురాలి భర్త తనను తీసుకెళ్లినట్టు రాజు చెప్పాడు. అతని స్నేహితులతో కలిసి వచ్చి.. మాట్లాడే పని ఉందని ఆపి వైద్యురాలు భర్తకు చెందిన బిర్యానీ సెంటర్ లోకి బలవంతంగా తీసుకెళ్లారని చెప్పాడు.
హోటల్లో తనపై హత్యాయత్నం చేసినట్లు బాధితుడు యాంసాని రాజు తెలిపాడు. అయితే.. డాక్టర్ డ్యూటీపట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న క్రమంలో వార్తలు రాసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోనే తనపై ఈ దాడి చేశారని, మొగుళ్లపల్లి డాక్టర్ తనపై హత్యాయత్నం చేయించారని వివరించాడు. జర్నలిస్టుల రక్షణ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని అధికారులను కోరాడు. ప్రస్తుతం తలకు దెబ్బ తగలడంతో ఎంజీఎంలోని న్యూరో వార్డులో 24 గంటల అబ్జర్వేషన్ లో ఉంచినట్టు డాక్టర్లు తెలిపారు. విలేకరిపై జరిగిన దాడిని జర్నలిస్టు యూనియన్లు తీవ్రంగా ఖండిచాయి.