హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ భూముల్లో ఇండ్లను కట్టుకున్న నిరుపేదలకు భూముల క్రమబద్ధీకరణ చేస్తున్న తరహాను రాష్ట్ర మంతటా అసైన్డ్ భూములకూ విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పేదలకు చెందిన అసైన్డ్ భూములపై వారికి యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి, నోటరీ చేయించుకున్న ఇండ్లకు, స్థలాలకు క్రమబద్దీకరణ, హక్కుల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది.
ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలు, సిఫార్సుల అమలులో భాగంగా కీలక నిర్ణయాల దిశగా సిద్ధమవుతున్నది. ఇప్పటికే కలెక్టర్లకు ప్రభుత్వం అందజేసిన ఫార్మాట్‌లో వివరాల సేకరణ చురుగ్గా జరుగుతోంది. గ్రామాల వారీగా భూముల లెక్కలు, ఆక్రమణలు, ఇండ్లను నిర్మించుకున్న వివరాలు రెడీ అవుతున్నాయి. గ్రామాలలో ఆబాదీ, గ్రామకంఠం కింద ఏర్పాటు చేసిన రికార్డులను ప్రత్యేకంగా అసెస్ చేసి నివేదికలో పొందుపరుస్తున్నారు. వీటిని మార్కెట్ విలువల ఆధారంగా రేట్లు ఫిక్స్ చేసి క్రమబద్దీకరించ డంతో భారీగా రిజిస్ట్రేషన్ ఆదాయాలు వస్తాయని, తద్వారా ప్రజలకు ఇతర వెసులుబాట్లతో ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామకంఠం, ఆబాదీ భూములు 25,062 ఎకరాలున్నాయి. ప్రభుత్వ భూముల్లో సేకరించిన భూముల్లో 26 వేల ఎకరాలు, సాదాబైనామా ల కింద 5లక్షల ఎకరాలు, ప్రభుత్వ భూములు 21లక్షల ఎకరాలున్నాయి. గ్రామాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల వివరాలు, ప్రభుత్వ సంస్థలు, భవనాలు, కార్యాలయాల వివరాలు, ఆక్రమణలు, మండలాల వారీగా ప్రభుత్వ భూములు, ఆక్రమణల్లో నిర్మించుకున్న ఇండ్లు, వారి ఆర్థిక, సామాజిక హోదా వంటి వివరాలు ప్రభుత్వానికి చేరాయి. 12 అంశాలతో నివేదికలను కలెక్టర్లు అందజేశారు.
అసైన్డ్ భూములకూ..
అదేవిధంగా ఇప్పటి వరకూ పట్టా కాగితాలకే పరిమితమైన ఈ భూములకూ పట్టాదార్ పాస్ పుస్తకాలిచ్చి వారికి సమున్నత హోదా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్రంలోని 22,63,139 ఎకరాల అసైన్డ్ భూములకు చెందిన 15.83లక్షల మందికి భూ యాజమాన్య హక్కుల కల్పన త్వరలో సాధ్యం కానున్నది. కులాల వారీగా కూడా భూ సేకరణ లబ్ధిదారుల వివరాలు గుర్తించారు.
వివిధ వర్గాల వారీగా 4,79,897మంది ఎస్సీలకు 5,62,789 ఎకరాలు, 3,08,48మంది ఎస్టీలకు 6,66,037 ఎకరాలు, 6,14,325 మంది బీసీలకు 7,90,679 ఎకరాలు, 37,879 మంది మైనార్టీలకు 54,625 ఎకరాలు, లక్షా 5వేల 183మంది ఓసీలకు 1,42,733 ఎకరాలను భూమిని అసైన్డ్ చేసింది. ఇందులో 84,706 ఎకరాల భూమి ఇతరుల చేతుల్లో ఉన్నట్లుగా నిర్ధారించిన సర్కార్ వాటిపై సమగ్ర వివరాలను సేకరించింది. 1,85,101 ఎకరాలతో అసిఫాబాద్ మొదటి స్థానంలో ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో 1,66,557 ఎకరాలు, నల్గొండలో 1,38,686 ఎకరాలు, కామారెడ్డిలో 1,33,157 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని గుర్తించారు.
రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా అన్యాక్రాంతం
కాగా అసైన్డ్ భూముల అన్యాక్రాంతం ఎక్కువగా విలువైన భూములకు నిలయమైన రంగారెడ్డి జిల్లాలోనే జరిగినట్లుగా ప్రభుత్వానికి నివేదిక అందింది. రంగారెడ్డి పూర్వపు జిల్లా పరిధిలో దాదాపు 6,500 ఎకరాల అసైన్డ్ భూమి ప్రైవేటు పరం అయినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. ప్రధానంగా సరూర్‌నగర్, మహేశ్వరం, బాలాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్ ఇబ్రాహీంపట్నం, గండిపేట, షాద్‌నగర్, చేవెళ్ల ప్రాంతాల్లో చేతులు మారినట్లుగా గుర్తించారు.