Tuesday, November 26, 2024

HYD: పరువు హత్యపై స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ

హైద‌రాబాద్‌లోని స‌రూర్ న‌గ‌ర్‌లో జరిగిన పరువు హత్యను ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం,ఇస్లాం ప్రకారం ఇది నేరపూరిత చర్య అని అభివర్ణించారు. నాగ‌రాజును ఆశ్రిన్ సుల్తానా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుందని, అది సరైన చర్యేన‌ని చెప్పారు. అయితే, సుల్తాన్ సోదరుడికి నాగ‌రాజును చంపే హక్కు ఎక్కడిదని ఆయ‌న ప్రశ్నించారు. ఇటువంటి హ‌త్య‌లు చేయ‌డం రాజ్యాంగం ప్రకారమే కాకుండా ఇస్లాం ప్రకారం కూడా దారుణమైన నేరం అని చెప్పారు.

ఈ హ‌త్య ఘ‌ట‌న‌కు వేరే రంగు పులిమేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. హ‌త్య కేసులో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని తెలిపారు. తాము హంతకుల పక్షాన నిల‌బ‌డ‌బోమ‌ని స్పష్టం చేశారు.

కాగా, సరూర్ నగర్ లో బుధవారం(మే 4) రాత్రి జరిగిన పరువుహత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. నాగరాజు, అశ్రీన్‌ దంపతులు బైక్‌పై వెళ్తుండగా దుండగులు వారిని అడ్డుకొని దాడి చేశారు. నాగరాజును ఇనుప రాడ్‌తో తీవ్రంగా కొట్టి చంపేశారు. యువతి సోదరుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు.  అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 31న ఆర్య సమాజ్‌లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజు కార్ల షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement