హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తఎలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసేందుకు ఆదేశాలివ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం వాయిదాకు ససేమిరా అంది. ఆదివారం జరగనున్న పరీక్షను వాయిదా వేయడానికి ధర్మాసనం నిరాకరించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి దర్యాప్తు పూర్తయ్యేదాకా ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ ఇటీ-వల పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. లీకేజీ వ్యవహారంలో టీ-ఎస్పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని.. దాంతో ఆ సంస్థ విశ్వసనీయతపై సందేహాలున్నాయని ధర్మాసనానికి వారు వివరించారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను యూపీఎస్సీకి అప్పగించాలని పిటిషన్లో కోరారు.
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేవలం టీ-ఎస్పీఎస్సీలో పనిచేసే ఇద్దరు శాశ్వత, ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్ రావు ఈ కేసులో వాదనలు వినిపించారు. దీనికి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయడంతో పాటు అసిస్టెంట్ కంట్రోలర్, పరీక్షల రహస్య విభాగాల పర్యవేక్షణ నిమిత్తం చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని హైకోర్టుకు వివరించారు. గ్రూప్-1 పరీక్ష కోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు జరిగినట్లు- చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఇదివరకే ఆదేసించిన సంగతి తెలిసిందే.
ఈ పరీక్షకు సంబంధించి ఈ నెల 5న జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ విచారణ జరిపారు. అన్ని జాగ్రత్తలతో ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు చేసినట్లు అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 995 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు- వివరించారు. కొందరి అభ్యంతరాల కోసం లక్షలాది మంది విద్యార్థులను గందరగోళానికి గురి చేయవద్దని కోరారు. ఇరు వైపులా వాదనలు విన్న జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు నిరాకరించారు. ఈ మేరకు పిటిషన్లను కొట్టివేశారు. దీంతో సింగిల్ జడ్జి ఉత్తర్వులను పిటిషనర్లు ధర్మాసనం వద్ద సవాల్ చేశారు. జస్టిస్ అభినంద్ కుమార్, జస్టిస్ రాజేశ్వరరావు ధర్మాసనం నేడు విచారణ చేపట్టి అప్పీల్‌ను కొట్టివేసింది. ప్రిలిమ్స్ పరీక్షను నిలిపివేయడం పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. దీంతో రేపు జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష యధాతథంగా జరగనుంది.