Monday, October 28, 2024

సీఎం కేసీఆర్‌ ఉన్నంత వరకు సింగరేణి ప్రైవేట్​ పరం కాదు.. అవసరమైతే తెలంగాణను మించిన ఉద్యమం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సీఎం కేసీఆర్‌ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సింగరేణి కాలరీస్‌ను ప్రయివేటుపరం కానివ్వరని రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఉండగా సింగరేణి కార్మికులకు, సంస్థ మనుగడకు వచ్చిన ముప్పేమి లేదన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మించిన ఉద్యమం చేసేందుకైనా సీఎం వెనుకాడరని చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సింగరేణి ప్రయివేటీకరణ ప్రయత్నాలపై సభ్యులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాల్క సుమన్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, ఓరుగంటి చందర్‌, చిన్నయ్య లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానం చెప్పారు. సింగరేణి పై సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనలో నిజం ఉందన్నారు. సింగరేణిని ప్రయివేటీకరించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని అయితే సంస్థలో 51శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నందునే ఏమి చేయలేక ఆగిపోయారని చెప్పారు. మొత్తం నాలుగు సింగరేణి బ్లాకులను ప్రయివేటీకరించేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎండీఆర్‌ చట్టానికి 2015లో సవరణ తీసుకొచ్చి మరీ గనులను ప్రయివేటీకరించేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

గుజరాత్‌, రాజస్థాన్‌లో ఇచ్చిన మాదిరిగా సింగరేణి గనుల నిర్వహణను తెలంగాణకే కేటాయించాలని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాసినా పక్కనపెట్టేశారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలనూ అమ్ముతూ ఇప్పుడు దేశాన్నే అమ్మేందుకు సిద్ధమయ్యిందని విమర్శించారు. జాతీయవాదంతో అధికారంలోకి వచ్చి జాతినే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనూ అమ్ముతోందని నిందించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోకపోతే బీహెచ్‌ఈఎల్‌, ఎల్‌ఐసీని కూడా అమ్మేస్తారని, దేశ ప్రజల బతుకుల్లో చీకట్లు నింపుతారని ప్రజలకు గుర్తు చేశారు. సింగరేణి పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

సింగరేణి తెలంగాణ ఆత్మ: సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క
అంతకుముందు సింగరేణి ప్రయివేటీకరణ ప్రయత్నాలపై కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ… సింగరేణి తెలంగాణ ఆత్మ అని చెప్పారు. గుజరాత్‌ ప్రభుత్వానికి గనుల నిర్వహణను ఇచ్చి తెలంగాణకు ఇవ్వటం లేదని, కేంద్రానికి తెలంగాణపౖౖె ఎందుకంత వివక్ష అని నిలదీశారు. సింగరేణి ప్రయివేటీకరణ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను సభకు వివరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. సింగరేణి ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లిdలో ఏకగ్రీవ తీర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే ఢిల్లిdకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… సింగరేణి ప్రయివేటీకరణను ఆపేందుకు అవసరమైతే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు. మరో ఎమ్మెల్యే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ… సింగరేణికి భూములు ఇచ్చిన రైతుల సంక్షేమానిక కార్పోరేట్‌ ఫండ్‌ ను వినియోగించటం లేదని, ఆ డబ్బును కేంద్రమే నొక్కేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ … నిరుద్యోగ దీక్ష పేరిట బీజేపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని … సింగరేణిని ప్రయివేటీకరిస్తే లక్షలాది మంది ఉద్యోగాలు పోతాయని గుర్తు చేశారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం వేలంవేయడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ నేతలు కాంట్రాక్టర్లతో చేతులు కలిపారని మండిపడ్డారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ… భవిష్యత్‌లో సింగరేణి ఉంటుందా లేదా అన్న భయాందోళనలు నెలకొన్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement