దేశంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో అనేక మంది ఆక్సీజన్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరడంతో ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగింది. దీంతో దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో కోవిడ్ బాధితులు మృతి చెందుతున్నారు. అయితే ఒక చిన్న వ్యాయామం చేసి స్వంతంగా ఆక్సీజన్ సంపాదించుకోవచ్చని కేంద్రం చెబుతోంది. ముఖ్యంగా స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే చికిత్స పొందుతూ, శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ‘ప్రోనింగ్’ అని పిలిచే ఒక ప్రత్యేకమైన వ్యాయామం చాలా ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
బోర్లా పడుకుని ఊపిరి తీసుకోవడాన్ని ప్రోనింగ్ అంటారని కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. బోర్లా పడుకుని ఊపిరి తీసుకుంటే ఊపిరితిత్తులకు పూర్తి స్థాయిలో ఆక్సీజన్ అందుతుందట. పక్కకు పడుకుని తీసుకున్నా కూడా ప్రయోజనకమేనని ఆరోగ్య శాఖ తెలిపింది. బోర్లా పడుకుని ఒక దిండు మెడ కింది భాగంలో మరో దిండు చాతి, మరో దిండు తొడలు, మరో దిండు మోకాళ్లకు కింది భాగంలో పెట్టుకుని ఊపిరి తీసుకోవాలి. ఎక్కువ సమయం పడకపైనే ఉండే రోగులు వివిధ భంగిమల్లో ఈ ప్రోనింగ్ చేయవచ్చు. ఒక్కో స్థానంలో 30 నుంచి 2 గంటల వరకు చేయొచ్చని ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే భోజనం చేసిన గంట వరకు ప్రోనింగ్ చేయద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అంతే కాకుండా తేలికగా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకే ప్రోనింగ్ చేయాలని తెలిపింది. అయితే, గర్భవతులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు, వెన్నెముకకు గాయమైన వాళ్లు దీనికి దూరంగా ఉంటే మంచిదని పేర్కొంది.