– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
మహిళలు తమ బాధలు, సమస్యలను చర్చించుకోవడానికి.. నలుగురితో పంచుకోవడానికి ఒక రోజు ఉండాలని నిర్ణయించారు.. ఆ రోజును మహిళా దినోత్సవంగా ప్రకటించారు. తొలిసారి అమెరికాలోని చికాగోలో మహిళా దినోత్సవానికి 1908లోనే బీజాలు పడ్డాయి. మహిళలకు పనిగంటలు, పనికి తగిన వేతనం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. వారి డిమాండ్లతో అమెరికాలోని సోషలిస్టుపార్టీ 1909 ఫిబ్రవరి 28న జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.
జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని కోపెన్హెగెన్ నగరంలో 1910లో జరిగిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్’ సదస్సులో క్లారా జెట్కిన్ ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అలా మహిళలకు ఓటుహక్కు, సమానహక్కు సాధించడానికి ఇలాంటి సమావేశాలు నాందిపలికాయి.
1911 మార్చి 19న 10 లక్షల మందికి పైగా ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశ మహిళలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ఓటుహక్కు, ప్రభుత్వ పదవులు కావాలని డిమాండ్ చేశారు. ఉపాధిలో లింగ వివక్షను వ్యతిరేకించారు. అమెరికాలో మాత్రం ప్రతి ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1913లో తొలిసారిగా రష్యన్ మహిళలు ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని జరిపారు.
మహిళల పోరాటాలతో సాధించిన విజయాలు
- 1814లో జర్మనీలో మహిళా దినోత్సవం నిర్వహించి ఓటుహక్కు కావాలని తీర్మానం చేశారు. 1918 వరకు మహిళలకు అక్కడ ఓటుహక్కు లభించలేదు
- 1917లో(గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి8) సెయింట్ పీటర్బర్గ్ మహిళలు మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలో ఆహార కొరత నివారించాలని డిమాండ్ చేశారు. అదే రోజున వస్త్ర పరిశ్రమలోని మహిళా శ్రామికులు అధికారుల హెచ్చరికలను లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి..హక్కుల కోసం నినాదాలు చేశారు.
- మార్చి 8న అధికారిక సెలవుగా ప్రకటించడానికి బోల్షెనిక్, అలెగ్జాండర్,కొలెవ్టైల్లు వ్లాదిమిర్ లెనిన్ను ఒప్పించారు. కానీ అది 1965 నాటి దాకా అమల్లోకి రాలేదు.
- చైనాలో 1922 నుంచి మహిళా దినోత్సవాన్ని ప్రకటించినా సగం సెలవు రోజుగా పేర్కొన్నారు.
- 1977 తర్వాత ప్రాచ్య దేశాల్లో మహిళా దినోత్సవానికి ప్రత్యేకత వచ్చింది. మహిళల హక్కులు, ప్రపంచ శాంతి దినంగా మార్చి 8ని ప్రకటించాలని పిలుపువచ్చింది.అమెరికా 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం బిల్లును తయారు చేసింది.