– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ప్రొడక్ట్ ఇంజినీరింగ్, సొల్యూషన్స్ సంస్థ జాప్‌కామ్ సీఈవో కిషోర్ పల్లంరెడ్డి సహా ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ జరిపిన భేటీలో ఒప్పందం కుదుర్చుకున్నారు. పర్యాటకం, ఆతిథ్యం, ఫిన్‌టెక్, స్థిరాస్తి రంగాలకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సేవలు అందిస్తోంది. దీని ద్వారా తొలుత 500 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కాలంలో ఈ సంఖ్య వెయ్యికి పెరుగుతుందని జాప్‌కామ్ సంస్థ వెల్లడించింది. మరోవైపు.. వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అమెరికాకు చెందిన పలు సంస్థలు, స్టార్టప్‌లు, వాటి ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏరోస్పేస్ రంగం వృద్ధి, డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదలను కేటీఆర్ వారికి కూలంకశంగా వివరించారు.
యూఎస్ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. ఈ రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. 2018, 2020, 2022లో ఏరోస్పేస్ రంగంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ అవార్డులు గెలుచుకోవడం గర్వకారణమన్నారు. 2020-21 ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్‌డీఐ ర్యాంకింగ్స్ లో ఏరోస్పేస్ సిటీ ఆఫ్ ఫ్యూచర్ గా హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందం డిస్కవరీ సంస్థతో జరిగింది. తెలంగాణలో వినోద రంగంలోకి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఎంట్రీ ఇస్తుందని కేటీఆర్ తెలిపారు. న్యూయార్క్‌లోని డిస్కవరీ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ తర్వాత ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ వినోద రంగంలోకి డిస్కవరీ రంగ ప్రవేశం చేయడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ హబ్‌గా ఐడీసీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కాగా, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తోపాటు మెడ్ ట్రానిక్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మెడ్ ట్రానిక్ 3వేల కోట్ల పెట్టుబడులను పెట్టనుంది.
మరోవైపు.. లైఫ్ సైన్సెస్ రంగంలో కీలక మార్పులు తీసుకురావడానికి ఆక్యుజెన్ సంస్థతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు మంత్రి కేటీఆర్. లైఫ్ సైన్సెస్ రంగాన్ని 250 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఆక్యుజెన్ సంస్థతో కేటీఆర్ సమావేశాలు జరిపారు. అనంతరం ఆక్యుజెన్ సంస్థ హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రాన్నిఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్‌తో భేటీలో ఆక్యుజెన్ ప్రతినిధులు ప్రకటించారు. ఆక్యుజెన్ సంస్థ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థ లైఫ్ సైన్సెస్ రంగంలో కీలకంగా మారుతుందన్నారు. జీన్, సెల్‌థెరపీకి సంబంధించి హైదరాబాద్‌లో అభివృద్ధి, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆక్యుజెన్ పేర్కొంది.