హైదరాబాద్, ఆంధ్రప్రభ : పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్న ఒక ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. పంజాబ్ కు చెందిన జగతార్ సింగ్, జైమాల్ సింగ్, అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న రంజిత్ సింగ్ అనే యువకుడి కోసం గాలిస్తున్నారు. అరెస్టు చేసిన వారి నుంచి 900 గ్రాముల కొకైన్‌తో పాటు లక్ష 44 వేల 800 నగదును, ఒక కార్, మూడు మోబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తొలిసారిగా పంజాబ్ నుండి తెలంగాణకు డ్రగ్స్ వచ్చిన మొదటి కేసు ఇది అని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. పట్టుబడ్డ కొకైన్ కేజీ 3 కోట్లుపై బడి ఉంటుందని సీపీ చెప్పారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపామని, డ్రగ్స్‌ను ఏ రూపంలో రవాణా చేసినా గుర్తించేందుకు నెట్‌వర్క్‌ను విస్తృత పరిచామన్నారు. డ్రగ్స్ విక్రేతలతో పాటు కొనుగోలు దారులపై కూడా కేసులు నమోదు చేస్తామని, పదే పదే పట్టుబడితే పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 233 కేసులు నమోదు అయ్యాయని, 10 వేల కిలోల గంజాయి, 4.3లీటర్ ఆశిష్ ఆయిల్‌తో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న 592 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇందులో 88 మందిపై పిడీ యాక్ట్ లు నమోదు చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ మూలాలను బయటకు తీసి వారిని అరెస్ట్ చేస్తున్నామని, డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారిని గుర్తించి వారిలో మార్పు కోసం ప్రతి మంగళవారం కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 75 మందికి డీ అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చామని, మాూదక ద్రవ్యాల రవాణా, వినియోగం తచ్చ విరుద్ధమని ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విస్తృతంగా అవగా#హన కల్పిస్తున్నామన్నారు.