ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో పర్యటనకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇవ్వాల ఆయన BRKR భవన్లో పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాన మంత్రి ఎల్లుండి ముచ్చింతల్, ఇక్రిసాట్ పర్యటనకు వస్తున్నందున తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పలు వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ను బ్లూ బుక్ ప్రకారం ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను సీఎస్ ఆదేశించారు. వైద్య పరికరాలతో పాటు నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు.
VVIP సందర్శన సమయంలో కోవిడ్-19 ప్రోటోకాల్‌లు పాటించేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆయన ఆదేశించారు. VVIP పాస్ హోల్డర్లు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందు RTPCR ను పరీక్షించాలని, కోవిడ్-19 కోసం తగినంత సంఖ్యలో స్క్రీనింగ్ బృందాలను మోహరించాలన్నారు. ప్రధానమంత్రి కాన్వాయ్ ఉపయోగించే రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని, తగినంత లైటింగ్ ఏర్పాట్లు చేయాలని R&B శాఖ అధికారులను ఆదేశించారు. వీఐపీల సందర్శనార్థం అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను కార్యక్రమాల నిర్వాహకులతో సమన్వయం చేయాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
ఈ సమీక్షలో డీజీపీ మహేందర్ రెడ్డి , స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, హెచ్‌ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యు సెక్రటరీ ఎస్‌ఏఎం రిజ్వీ, టీఆర్‌అండ్ బీ సెక్రటరీ కె.ఎస్.శ్రీనివాసరాజు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు సి.వి.ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర.. రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు అమోయ్ కుమార్, హరీష్ పాల్గొన్నారు.