ప్రగతి భవన్ నిర్మాణానికి దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు అయినట్టు ఆర్టీఐ ద్వారా బుధవారం వెల్లడయ్యింది. బేగంపేటలో ఉన్న ప్రగతి భవన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉంది. హైదరాబాద్‌కు చెందిన కార్యకర్త రాబిన్ జాకీస్ దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్‌టిఐ) ప్రశ్నకు సమాధానంగాతెలంగాణ ప్రభుత్వంలోని రోడ్లు మరియు భవనాల శాఖ ప్రజాసంబంధాల అధికారిదీని వివరాలను అందించారు. ప్రగతి భవన్‌ను నిర్మించినప్పటి నుండి దాని కోసం చేసిన మొత్తం ఖర్చును వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రగతి భవన్ నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం రూ.49,84,14,145గా వెల్లడించారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు 2016లో హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మించిన భవనాన్ని.. ఆఫీసర్స్ కాలనీలో ఉన్న 10ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు, 24 ప్యూన్ క్వార్టర్లను కూల్చివేసి నిర్మించారు. తొమ్మిది ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ సముదాయానికి 2016-2017 ఆర్థిక సంవత్సరంలో రూ.45,91,00,000 ఖర్చయ్యింది.
ఆ తర్వాత నాలుగేళ్లలో మరో 4 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. 2017-18లో రూ. 14 లక్షలతో క్యాంపు కార్యాలయంలో ప్లంబర్లు, కార్పెంటర్ల పనులు.. 2019-20లో రూ. 26 లక్షలతో భవనానికి తూర్పు వైపున పెట్రోలింగ్ మార్గం నిర్మాణం.. మాడ్యులర్‌ను నిర్మించడం వంటి కొన్ని ఖర్చులున్నాయి. 26 లక్షలతో ముఖ్యమంత్రి నివాసంలో వంటగది నిర్మించారు. ప్రగతి భవన్ అనేది ఐదు భవనాల సమాహారంగా ఉన్న- నివాసం. ముఖ్యమంత్రి కార్యాలయం, జనహిత (మీటింగ్ హాల్), పాత సీఎం నివాసం, క్యాంపు కార్యాలయంగా ఉందని ఆర్టీఐ దరఖాస్తు దారుకు వెల్లడించిన వివరాల్లో పొందుపరిచారు.