తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా మరో 13 మంది దుర్మరణానికి కారణమైన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై (CSD Bipin Rawat Helicopter Crash) ఎంక్వైరీ పూర్తయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐఏఎఫ్, ఆర్మీ, నేవీకి చెందిన అధికారులు ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. కాగా, వచ్చే వారమే ఘటనకు సంబంధించిన నివేదికను వైమానిక దళానికి (ఐఏఎఫ్) సమర్పించనున్నట్లు (IAF report on Helicopter Crash) సమాచారం.
ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం ‘‘మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? వాతావరణం అనుకూలించలేదా?’’ అనే విషయాలతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినట్లు తెలిసింది. ల్యాండింగ్ సమయంలో సిబ్బంది అయోమయ స్థితిలో ఉన్నారా అనే అంశాన్ని కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తు బృందంలో ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్తో పాటు ఆర్మీ, నేవీలకు చెందిన బ్రిగేడియర్ ర్యాంక్ అధికారులు దర్యాప్తులో పాల్గొని నివేదికను రూపొందించారు.
ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ విచారణకు సంబంధించి ఓ అధికారి కీలక ప్రకటన కూడా చేశారు. అన్ని నిబంధనలకు లోబడే ఈ విచారణ జరిగిందనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు చట్టపరమైన పరిశీలన జరగుతున్నట్లు వివరించారు. అయితే విచారణకు సంబంధించి ఇప్పటి వరకు త్రివిధ దళాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..