న్యూఢిల్లీ–హౌరా మధ్య నడిచే దురంతో హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ఆయుధాలతో వచ్చిన దొంగలు పాట్నా దాటుతుండగా రైలులోకి చొరబడ్డారు. ఆ దుండగులు ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి గొలుసు, మరొక వ్యక్తి నుంచి బ్యాగును లాక్కొని పారిపోయారు. ఇవ్వాల రైలు హౌరాకు చేరుకున్న తర్వాత మహిళలు ప్రభుత్వ రైల్వే పోలీసులతో పాటు GRPకి ఈ విషయాన్ని ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన బిహార్‌లోని దానాపూర్ డివిజన్ పరిధిలోకి వచ్చే ప్రదేశంలో జరిగినందున.. తదుపరి చర్యల కోసం ఫిర్యాదును అక్కడికి పంపినట్టు అధికారులు తెలిపారు. అయితే.. టెక్నికల్ స్టాప్‌లు మాత్రమే ఉన్న ఈ రైలులో దోపిడీ ఎట్లా జరిగిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీని గురించి ఈస్టర్న్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏకలవ్య చక్రవర్తిని వివరణ కోరగా.. ఈ ఘటనపై తమకు ఎట్లాంటి సమాచారం లేదన్నారు. ఇంత పెద్ద దోపిడీ జరిగి ఉంటే తమకు ఈపాటికే వార్తలు వచ్చేవని చెప్పారు. అయితే.. ఈ దోపిడీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.