Tuesday, November 19, 2024

ఇంతకీ ఆయన ‘వకీల్‌సాబ్’ని పొగిడాడా? తిట్టాడా?

‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ వంగా. ‘వకీల్ సాబ్’ను ఉద్దేశించి ఆయన రీసెంట్‌గా పెట్టిన ఓ ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. ‘పింక్ టర్న్స్ బ్లూ ’ అంటూ సందీప్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. పింక్ అంటే ఉమెన్ అని, బ్లూ అని మెన్ అని సంభోదిస్తారు. కానీ సందీప్ చేసిన ఈ ట్వీట్‌ను లోతుగా పరిశీలిస్తే వ్యంగ్యంగానే ఇలా పెట్టాడని అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆడవాళ్ల కోసం తీసిన సినిమా మగవాసన వస్తోందని అర్థం వచ్చేలా విమర్శించాడని అంటున్నారు.

గతంలో అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ సినిమా సమయంలో ఓ టీవీ ఛానల్‌కు సందీప్ వంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు అందులో నిజాయతీ ఉంటుంది. ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ లేకపోతే అక్కడ ఏమీ ఉండదు. మీ మహిళా భాగస్వామిని చెంప దెబ్బ కొట్టలేకపోతే, అమ్మాయిని ఎక్కడ కావాలంటే అక్కడ టచ్ చేయలేకపోతే, ముద్దు పెట్టుకోలేకపోతే, అసభ్యంగా మాట్లాడలేకపోతే… అక్కడ నాకైతే ఎలాంటి ఎమోషన్స్ కనిపించడం లేదు’ అంటూ సదరు ఇంటర్వ్యూలో సందీప్ వంగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారి పెద్ద దుమారాన్నే లేపాయి. సమంత సహా పలువురు హీరోయిన్లు, మహిళా సింగర్లు సందీప్ వ్యాఖ్యలను బహిరంగంగానే ఖండించారు.

ఆ తర్వాత మహిళా భాగస్వామిని చెంపమీద కొట్టే అంశంతో తాప్సీ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో ‘తప్పడ్’ అనే మూవీ కూడా తెరకెక్కింది. అయితే ‘కబీర్ సింగ్’ నాటి అనుభవాల కారణంగా సందీప్ వంగా డిఫెన్స్‌లో పడిపోయాడని.. అందుకే అతడు సోషల్ మీడియాలో పలు సినిమాల గురించి ఏ పోస్టు పెట్టినా ఆడవాళ్లను తక్కువ చేసి చూపిస్తుంటే ఎలా ఊరుకుంటున్నారు అంటూ ప్రశ్నించేలా ఉంటున్నాయని ఫిలింనగర్‌లో వినపడుతున్నాయి.

తాజాగా ‘పింక్ టర్న్స్ బ్లూ ’అనే కామెంట్ కూడా అలాంటిదేనని, ముఖ్యంగా ఆడవాళ్లకు జరిగిన అన్యాయంపై తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ వంటి చిత్రంలో పవన్ కళ్యాణ్ డామినేషన్ ఎక్కువగా ఉందని సందీప్ తన ట్వీట్ ద్వారా పరోక్షంగా విమర్శిస్తున్నాడని సోషల్ మీడియాలో మళ్లీ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement