ఎల్గార్ పరిషత్ మావోయిస్టు లింక్స్ కేసులో నిందితుడైన కవి, సామాజిక కార్యకర్త వరవరరావు దాఖలు చేసిన శాశ్వత మెడికల్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం బొంబాయి హైకోర్టును కోరింది. తనపై అభియోగాలు చాలా చాలా తీవ్రమైనవి.. రుజువైతే మరణశిక్ష కూడా విధించవచ్చు. అని ఎన్‌ఐఏ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అన్నారు. వరవరరావు (83) సాధారణ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, వారికి అవసరమైన వైద్య సహాయం అందజేస్తామని హామీ ఇచ్చేందుకు దర్యాప్తు సంస్థ సిద్ధంగా ఉందని హైకోర్టుకు తెలిపారు. అవసరమైతే జైలులో లేదా ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తామని తెలిపారు. ‘‘మేము నిపుణులం కాదు. పూర్తిగా వైద్యుల నివేదికపై ఆధారపడతాం. అతనికి నిరంతర వైద్య సంరక్షణ అవసరమని ఒక వైద్యుని నివేదికను అనుసరించి గత ఏడాది హైకోర్టు అతనికి తాత్కాలిక మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అతను డిశ్చార్జ్ కావాల్సి ఉంది. కాగా, శాశ్వత వైద్యపరమైన బెయిల్ కావాలా? మొత్తం విచారణ ముగిసే వరకు అతను బెయిల్‌పై కొనసాగుతారా’’ అని సింగ్ ప్రశ్నించారు.
అయితే, న్యాయమూర్తులు ఎస్‌బి శుక్రే, ఎస్‌ఎం మోదక్‌లతో కూడిన ధర్మాసనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి)లోని సెక్షన్ 437 ప్రత్యేక పరిస్థితులలో నిందితుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా శాశ్వత బెయిల్‌ను పొందొచ్చని తెలియజేయగా.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న JJ హాస్పిటల్స్‌లోని వైద్యులు ఏదైనా వ్యాధికి చికిత్స చేసేంత సమర్ధులని, అవసరమైనప్పుడు వరవరరావుకు అక్కడ తగిన సంరక్షణ అందించగలరని సింగ్ వాదనలు వినిపించారు.
ఇతర జైలు ఖైదీలందరినీ JJ ఆసుపత్రికి తీసుకువెళతారు. వారికి ఒకే విధమైన చికిత్స అందుతుంది. మానవతా దృక్పథంతో ఉండాలి. అయితే అతను (శాశ్వత వైద్య బెయిల్ మంజూరు చేయడం ద్వారా) విడుదల చేయలేము అని సింగ్ కోర్టుకు తెలిపారు. కాగా, 83 ఏళ్ల తెలుగు కవి పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. మెడికల్ టెస్టుల్లో కూడా ఈ వ్యాధి తీవ్రంగా ఉందని నిర్ధారణ అయ్యిందని వరవరరావు తరపు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ పునరుద్ఘాటించారు.
‘‘అతను అంత ప్రమాదకారి కాదు. వరవరరావు క్లినికల్ రిపోర్టులు NIA చదవలేదు.. కనీసం చూడను కూడా లేదు. అతని బ్లడ్ గడ్డకట్టే ప్రమాదం ఉంది.. అటువంటి ప్రమాదం యొక్క తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారు’’ అని న్యాయవాది గ్రోవర్ కోర్టుకు తెలిపారు. అల్లోపతి వైద్యుడు కూడా లేని తలోజాలో ఈ పరిస్థితిని ఎలా నిర్వహిస్తారు. అని గ్రోవర్ ప్రశ్నించారు. నమ్మకంగా ఉన్నందున విచారణలో నిలబడాలనుకుంటున్నాం. ఎంతకాలం వేచి ఉండాలి? తీర్పు రావడానికంటే ముందు అతను చనిపోవాలా? ఒక వ్యక్తి (సహ నిందితుడు) స్టాన్ స్వామి అప్పటికే చనిపోయాడు అని గ్రోవర్ చెప్పారు. ఫిబ్రవరి 2021లో తనకు మంజూరైన తాత్కాలిక బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ వరవరరావు దాఖలు చేసిన మూడు పిటిషన్లపై హైకోర్టు అన్ని వాదనలను ముగించింది. మరొకటి బెయిల్‌పై ఉన్న తన హైదరాబాద్ ఇంటికి తిరిగి వెళ్లేందుకు వీలుగా అతని బెయిల్ షరతులను సవరించాలని కోరింది. మూడు పిటిషన్లపై తుది ఉత్తర్వులు వెలువడే వరకు తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.