ఒక బాలికపై ఆమె తండ్రి, అన్న, తాత, దూరపు బంధువు ఐదేండ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ అనే అంశాన్ని ఇటీవల స్కూల్లో విద్యార్థులకు వివరించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో తండ్రి, సోదరుడిపై అత్యాచారం కింద, తాత, దూరపు బంధువుపై లైంగిక వేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన ఒక కుటుంబం మహారాష్ట్రలోని పూణెలో నివసిస్తున్నది. ఆ కుటుంబానికి చెందిన మైనర్ బాలిక స్కూల్లో ఇటీవల ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’ అనే అంశాన్ని వివరించారు.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తనపై పాల్పడిన అఘాయిత్యాలను ఆ బాలిక బయటపెట్టింది. 2017లో బిహార్‌లో ఉన్నప్పటి నుంచి తండ్రి, 2020 నవంబర్‌లో అన్న తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ బాలికి ఆరోపించింది. అలాగే తాత, దూరపు బంధువు కూడా తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు చెప్పింది. ఈ నేపథ్యంలో 45 ఏండ్ల తండ్రి, సోదరుడిపై అత్యాచారం, 60 ఏండ్ల తాత, 25 ఏండ్ల దూరపు బంధువుపై అసభ్య ప్రవర్తన వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పూణె పోలీస్ ఇన్స్పెక్టర్ (క్రైమ్) అశ్విని సత్పుటే తెలిపారు.
పోక్సో చట్టం సెక్షన్లు కూడా జత చేసినట్లు చెప్పారు. కాగా, బాలికపై వేర్వేరుగా లైంగిక దాడి ఘటనలు జరిగినందున సామూహిక లైంగిక దాడి కిందకు ఈ కేసు రాదని వివరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు